Sindhu River | న్యూఢిల్లీ, మే 21: పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో సింధూ జలాల సరఫరాను నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంతో సింధు ప్రావిన్స్‌లో నీటికి తీవ్ర కటకట ఏర్పడింది. నీళ్లు లేకపోవడంతో సింధూ ప్రాంతవాసులు ఎదురు తిరిగారు. పాక్ హోం మంత్రి జియావుల్ హసన్ ఇంటిని తగలబెట్టారు. సింధూ నది వ్యవస్థపై వివాదాస్పదమైన, సైన్యం మద్దతుతో చేపడుతున్న కాలువ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సింధు ప్రావిన్స్‌లో జరుగుతున్న ఆందోళనలు ఉధృతమయ్యాయి.
సింధు ప్రావిన్స్‌పై వివక్ష చూపుతూ పంజాబ్ ప్రాంత అనుకూల వైఖరిని అనుసరిస్తున్నారని వారు మంత్రి జియావుల్ హసన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత నెలలో ఈ ప్రాజెక్టును నిలిపివేసిన తర్వాత నిరసనలు తీవ్రమవుతున్న తరుణంలో మంగళవారం ఇద్దరు కార్యకర్తలను కాల్చి చంపడం ఆందోళనకారుల్లో మరింత ఆగ్రహాన్ని కలిగించింది. తమ నీటి కష్టాలకు పంజాబ్ ఆధిపత్యమే కారణమని సింధ్ నిరసనకారులు ఆరోపించారు.
ఆందోళనలో పాల్గొన్న సింధీ నేషనలిస్ట్ పార్టీ జేఎస్ఎంఎంకు చెందిన జహిద్ లగహరి అనే కార్యకర్తతో పాటు మరో వ్యక్తిని మంగళవారం పోలీసులు కాల్చి చంపడంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి ప్రతిగా ఉత్తర సింధూలోని నౌషారా ఫిరోజ్ జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
ఆందోళనకారులు జాతీయ రహదారిని దిగ్బంధించి రెండు ఆయిల్ ట్యాంకర్లను దహనం చేశారు. సింధూ నది నుంచి నీటిని పంజాబ్ ప్రాంతానికి మళ్లించడానికి తవ్వుతున్న కాల్వ వల్ల తమకు భవిష్యత్‌లో తాగు, సాగునీటికి తీవ్ర కొరత ఏర్పడుతుందని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. సింధులో భద్రతను పెంచేందుకు పాక్ మిలిటరీ దళాలను రంగంలోకి దింపింది. ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.