Monsoon Session | కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడి ఘటనలపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చించేందుకు అంగీకరించింది. ఈ రెండు అంశాలపై చర్చించాలంటూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దాంతో సభా కార్యకలాపాలకు అంతరాయం కలుగుతున్నది. వరుసగా పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడుతూ వచ్చాయి. శుక్రవారం సైతం ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలో ఉభయ సభలు సోమవారానికి వాయిదాపడ్డాయి. ఆపరేషన్ సిందూర్ అంశంపై సోమవారం (జులై 28ణ) చర్చ జరుగనున్నది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో ‘ఆపరేషన్ సిందూర్’పై చర్చను ప్రారంభిస్తారు. ఈ చర్చలో హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్‌తో పాటు బీజేపీ ఎంపీలు అనురాగ్ ఠాకూర్, నిషికాంత్ దూబే పాల్గొంటారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం చర్చలో పాల్గొనే అవకాశం ఉన్నది.
జులై 29న రాజ్యసభలో ఈ అంశంపై చర్చ ప్రారంభం కానున్నది. రాజ్‌నాథ్ సింగ్, జైశంకర్‌తో పాటు ఇతర మంత్రులు పాల్గొంటారు. ఎగువ సభలో జరిగే చర్చలోనూ ప్రధాని మోదీ పాల్గొంటారని భావిస్తున్నారు. అంశంపై ఉభయసభల్లో 16గంటల పాటు చర్చ ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అఖిలపక్ష సమావేశం అనంతరం కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే ముందుకు కాంగ్రెస్ సహా అనేక పత్రిపక్ష పార్టీలు ఆపరేషన్ సిందూర్, పహల్గామ్ ఉగ్రదాడిపై పార్లమెంట్లో చర్చించాలని డిమాండ్ చేశాయన్నారు. దీనిపై చర్చించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామన్నారు. ప్రతిపక్షం తొలిరోజు నుంచి పార్లమెంట్లో గందరగోళం సృష్టిస్తుందని.. పార్లమెంట్ లోపల, వెలుపల నిరసన తెలుపుతుందని.. సభ పని చేయనివ్వడం లేదని ఆరోపించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలివారంలో తాము ఒకే ఒక బిల్లును ఆమోదించగలిగామని.. పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగించొద్దని ప్రతిపక్ష పార్టీలను కోరుతున్నానన్నారు.