Dino Morea | ముంబయిలోని మిథి నది కుంభకోణంలో నటుడు డినో మోరియాకు ఈడీ సమన్లు జారీ చేసింది. అలాగే, నటుడితో సోదరుడితో పాటు ఎనిమిది మందిని వచ్చేవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఇటీవల ఈడీ నటుడికి చెందిన కార్యాలయాలు, నివాసంపై దాడి చేసిన విషయం తెలిసిందే. రూ.65కోట్ల మిథి నది కుంభకోణానికి సంబంధించిన కేసులో డినో మోరియా, అతని సోదరుడు, పలువురు బీఎంసీ అధికారులతో సహా ఎనిమిది మందికి ఈడీ సమన్లు పంపామని.. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద వాంగ్మూలాలు నమోదు చేయనున్నట్లు పేర్కొంది. మిథి నది కుంభకోణంలో నటుడి పేరు వెలుగులోకి రావడంతో చిక్కుల్లోపడ్డారు.
మిథి నది పూడికతీత కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఈ క్రమంలోనే డినో మోరియా ఇంటిపై దాడి చేసింది. అలాగే, అతని సోదరుడితో పాటు పలువురికి చెందిన రహస్య స్థావరాలపై సైతం ఈ దాడులు చేసింది. దాడులు జరిపిన మరుసటి రోజే ఈడీ విచారణకు రావాలని నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఈ కేసులో నటుడు డినో మోరియాను ముంబయి పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) సైతం రెండుసార్లు విచారించింది. మిథి నదిని శుభ్రం చేసేందుకు ఉపయోగించే స్లడ్జ్ పుషర్, డ్రెడ్జింగ్ యంత్రాల విషయంలో భారీ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి.