బెళగావి, డిసెంబర్ 19: బెళగావిలోని ప్రజా పనుల శాఖ మంత్రి సతీశ్ నివాసంలో గురువారం రాత్రి సీనియర్ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు కొందరు పాల్గొన్న విందు సమావేశానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరు కావడంతో రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై మళ్లీ ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ విందు సమావేశంలో సీనియర్ మంత్రులు పరమేశ్వర, మహదేవప్ప, జమీర్ అహ్మద్ ఖాన్, ఎంసీ సుధాకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏఎస్ పొన్నన్న తదితరులు పాల్గొన్నట్లు తెలిసింది. విందులో పాల్గొన్న వారంతా సిద్ధరామయ్యకు పార్టీలో అత్యంత సన్నిహితులుగా పేరు పొందారు.
ముఖ్యమంత్రి న్యాయ సలహాదారు, ఎమ్మెల్యే ఏఎస్ పొన్నన్న విలేకరుల వద్ద స్పందిస్తూ ఇది చాలా సాధారణ సమావేశమేనని చెప్పారు. అయితే ఈ విందు సమావేశం తర్వాత అదే రోజు రాత్రి బెళగావిలోని ఓ హోటల్లో మరో సమావేశం జరగడం విశేషం. జార్కిహోళి ఆతిథ్యమిచ్చిన ఈ విందు సమావేశంలో 30 మందికిపైగా భావ సారూప్యం ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి సిద్ధరామయ్య హాజరు కానప్పటికీ ఆయన కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్రతోపాటు మరో విధేయుడు ఎమ్మెల్యే కేఎన్ రాజన్న పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మార్పు జరగవచ్చని ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో వరుసగా రెండు విందు సమావేశాలు జరగడం చర్చనీయాంశంగా మారింది.
తనకు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు మధ్య రెండున్నరేండ్ల అధికార పంపకం ఒప్పందం ఉన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం తోసిపుచ్చారు. ముఖ్యమంత్రిగా తానే ఐదేండ్ల పాటు కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో నాయకత్వం మార్పుపై సూటిగా జవాబివ్వడానికి నిరాకరించిన ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కాంగ్రెస్ అధిష్ఠానం జోక్యంతో తాను, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓ అవగాహనకు వచ్చామని, తామిద్దరం దానికి కట్టుబడి ఉంటామని తెలిపారు. పార్టీ హైకమాండ్ నిర్ణయం మేరకు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఆయన పదవీకాలంపై తాను ఎన్నడూ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని డీకేఎస్ స్పష్టం చేశారు.