ప్రస్తుత సమాజంలో మహిళలకు భద్రత చాలా కీలకమని కర్నాటక మంత్రి దినేష్ గుండూరావు అన్నారు. మహిళల భద్రత కోసం చట్టాలను కూడా పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. గుండూరావు బుధవారం చెన్నైలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఘటన అనంతరం ఆస్పత్రుల్లో మహిళల భద్రతపై తాము ఓ కమిటీని ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు.
మహిళల భద్రతను ముమ్మరం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తున్నామని తెలిపారు. మహిళల భద్రతకు మనం ప్రాధాన్యత ఇవ్వాలని, సమాజంలో మహిళలను నిత్యం లక్ష్యంగా చేసుకుని పురుషులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని నిరోధించేందుకు కఠిన చట్టాలు రూపొందించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
కాగా, మహిళలు పనిచేసే చోట వేధింపుల నుంచి వారిని కాపాడాల్సిన అవసరం ఉందని డీఎంకే ఎంపీ కనిమొళి అన్నారు. తమకు భద్రత కల్పించాలని మహిళలు కోరడంలో ఎలాంటి తప్పు లేదని ఆమె పేర్కొన్నారు. కనిమొళి బుధవారం చెన్నైలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మహిళలపై ఏ రకమైన వేధింపులు జరగకుండా నిరోధించడం ముఖ్యమని చెప్పారు. పని ప్రదేశాల్లో మహిళలను కాపాడుకోవాలని ఇది మనందరి కర్తవ్యమని ఆమె పేర్కొన్నారు.
Read More :
Hydraa | హైడ్రా పేరుతో రూ.20 లక్షలు డిమాండ్.. డాక్టర్ను అరెస్ట్ చేసిన పోలీసులు