న్యూఢిల్లీ, జనవరి 19: వచ్చే మూడేండ్లలో పాఠశాల, ఉన్నత విద్య స్థాయిలో బోధించే వివిధ కోర్సులకు సంబంధించిన స్టడీ మెటీరియల్ను అన్ని భారతీయ భాషలలో విద్యార్థులకు డిజిటల్ రూపంలో అందించాలని పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలను కేంద్రం ఆదేశించింది.చాలా ప్రాంతాల్లోని విద్యార్థులు మొదటి నుంచి మాతృభాషలోనే విద్యాభ్యాసం చేయడం, తర్వాత ఉన్నత చదువులకు తమ మాతృ భాషలో స్టడీ మెటీరియల్ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. దేశంలోని విద్యార్థులకు తమ మాతృభాషలోనే విద్యను అభ్యసించే అవకాశం కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. జాతీయ విద్యా విధానం సిఫార్సుల మేరకు విద్యలోని ప్రతి స్థాయిలో బహుభాషా వాదాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది. స్టడీ మెటీరియల్ను భారతీయ భాషలలో డిజిటల్ రూపంలో తేవాలని యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్సీఈఆర్టీ, ఎన్ఐఓఎస్, ఇగ్నో వంటి సంస్థలతోపాటు ఐఐటీ, ఐఎన్ఐ, సీయూ, ఎన్ఐటీ సంస్థల అధిపతులను కేంద్రం ఆదేశించింది.