న్యూఢిల్లీ, జూన్ 29: దేశవ్యాప్తంగా అన్ని పంచాయతీ ఆఫీసుల్లో ఇక నుంచి యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులు తప్పనిసరి చేస్తూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. అన్ని రకాల అభివృద్ధి, రెవెన్యూ వసూళ్లను డిజిటల్ పేమెంట్ల ద్వారా చేపట్టబోతున్నామని గురువారం మీడియాకు విడుదల చేసిన లేఖలో పేర్కొంది. స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 నుంచి ఇది అమల్లోకి రాబోతున్నదని తెలిపింది. దాదాపు 98శాతం పంచాయతీలు ఇప్పటికే డిజిటల్ చెల్లింపుల సేవల్ని ప్రారంభించాయని తెలిపింది. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం, భీమ్, మొబిక్విక్, వాట్సాప్ పే, అమెజాన్ పే, భారత్ పే ద్వారా చెల్లింపులు చేయవచ్చునని తెలిపింది.