బెంగళూరు, జనవరి 23: కర్ణాటక రాజకీయాల్లో రోజుకో రచ్చ మొదలవుతున్నది. ఇంతకాలం కాంగ్రెస్ నేతల మధ్య కనిపించిన విభేదాలు ఇప్పుడు బీజేపీలోనూ తీవ్రంగా మారాయి. హస్తం పార్టీలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య వర్గపోరు కొనసాగుతుండగా, బీజేపీలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిపైనే తిరుగుబాటు మొదలయ్యింది. కమలం పార్టీలోని కీలక నేతలు ఒకరిపై ఒకరు బాహాటంగా దుమ్మెత్తిపోసుకుంటున్నారు. మరోవైపు బీజేపీలో కీలక నేతలు, మాజీ మంత్రులు గాలి జనార్ధన్ రెడ్డి, బీ శ్రీరాములు మధ్య పోరు ముదిరింది. ఒకనాటి మిత్రులైన వీరు ఇప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇలా కర్ణాటక అధికార,విపక్ష నేతలు అంతర్గత పోరులో తలమునకలవుతున్నారు.
కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమర్ వర్గాల మధ్య పోరు కొనసాగుతున్నది. బాహాటంగా విమర్శలు చేసుకోకపోయినా ఒకరిపై ఆధిపత్యానికి ఇంకొకరు గ్రూపు రాజకీయాలు నెరపుతున్నారు. సిద్ధరామయ్యను దించితే సీఎం పదవిని దక్కించుకునేందుకు డీకే ప్రయత్నిస్తుండగా, పీసీసీ చీఫ్ పదవిని మరొకరికి ఇప్పించి, డిప్యూటీ సీఎంగా ఇంకా ఒకరిద్దరిని నియమించడం ద్వారా డీకే శివకుమార్‌కు చెక్ పెట్టేందుకు సిద్ధరామయ్య వర్గం ప్రయత్నిస్తున్నది. మరోవైపు గ్యారెంటీల రగడ కూడా పార్టీలో నడుస్తున్నది. ఎన్నికల్లో గెలిచేందుకు ప్రకటించిన ఈ ఉచితాలను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ హైకమాండ్‌ను ధిక్కరించి మరీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రతిపక్ష బీజేపీలోనూ విభేదాలు వీధినపడ్డాయి. మాజీ సీఎం యెడియూరప్ప కుమారుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బీవై విజయేంద్రపై నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. విజయేంద్ర ఒక బచ్చా అంటూ ఇటీవల గోకక్ ఎమ్మెల్యే రమేశ్ జార్కిహోళి విమర్శించారు. బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ సైతం యెడియూరప్ప, విజయేంద్రపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా, గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీరాములు మధ్య విభేదాలు ముదిరి రోడ్డున పడ్డాయి. సండూర్ ఉప ఎన్నికలో ఓటమికి శ్రీరాములే కారణమంటూ జనార్ధన్ రెడ్డి వర్గం బీజేపీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేయగా, బళ్లారి జిల్లాలో జనార్ధన్ రెడ్డి బీజేపీని చీలుస్తున్నారని శ్రీరాములు ఆరోపించారు.