బెంగళూరు, జూలై 29: కర్ణాటకలో నాయకత్వ మార్పుపై జోరుగా ఊహాగానాలు సాగుతున్న వేళ సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం సిద్ధరామయ్య సమావేశాలు నిర్వహిస్తుండగా, వీటికి డీకేను పక్కనబెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి పనుల నిమిత్తం ఇటీవలే ఎమ్మెల్యేలకు రూ.100 కోట్ల చొప్పున సీఎం సిద్ధరామయ్య నిధులు కేటాయించారు.
తాజాగా జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమావేశాలకు డీకే దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సాధారణంగా ఇలాంటి సమావేశాలు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో జరుగుతాయి. అయితే ఈసారి విధాన సౌధలో సీఎం చాంబర్లో జరుగుతుండటం గమనార్హం. డీకేను దూరం పెట్టేందుకే ఉద్దేశ పూర్వకంగా ఇలా చేశారన్న ప్రచారం సాగుతున్నది.