లక్నో, జూలై 17: లోక్‌సభ ఫలితాలు ఇచ్చిన షాక్ నుంచి ఉత్తరప్రదేశ్ బీజేపీ బయటపడటం లేదు. ఇంతకాలం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాటే శాసనంగా నడిచిన ఆ పార్టీలో ఇప్పుడు అసంతృప్త గళాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్‌కు ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యకు మధ్య విభేదాలు తీవ్రమయ్యాయనే ప్రచారం జరుగుతుంది. ఇటీవలి పరిణామాలు ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి. ఒకవైపు లోక్‌సభ ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలకు బాధ్యత వహిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి భూపేంద్ర చౌదరి రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా త్వరలో యూపీలో 10 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికలు బీజేపీకి మరో సవాల్‌గా మారాయి.
సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మధ్య విభేదాలు మొదలయ్యాయి. గత నెల రోజులుగా మంత్రులతో యోగి నిర్వహించిన సమావేశాలకు మౌర్య హాజరుకావడం లేదు. ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో మౌర్య మాట్లాడుతూ.. ‘పార్టీ కంటే ఎవరూ పెద్ద కాదు. ప్రభుత్వం కూడా పార్టీ కంటే ఎక్కువ కాదు’ అని చేసిన వ్యాఖ్యలు యోగిని ఉద్దేశించినవే అనే భావన నెలకొన్నది. మరోవైపు యూపీలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సీట్లు 62 నుంచి 33కు తగ్గిపోవడం పట్ల బీజేపీ నేతలు వ్యక్తిగత సంభాషణల్లో యోగి వైఖరినే నిందిస్తున్నారు. ఆయన పాలనా తీరు వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపిస్తున్నారు. యోగీ మాత్రం అతివిశ్వాసం వల్లే తక్కువ సీట్లు వచ్చాయని పేర్కొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రాజీనామా
లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో పార్టీకి వచ్చిన వ్యతిరేక ఫలితాలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి నిర్ణయించారు. యూపీ వ్యవహారాలు బీజేపీ హైకమాండ్‌కు కూడా తలనొప్పిగా మారాయి. దీంతో యోగి, మౌర్య, భూపేంద్రతో నరేంద్ర మోదీ, అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వరుస సమావేశాలు నిర్వహించారు. బీజేపీలో ఈ పరిస్థితిపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ… అంతర్గత కలహాలతో బీజేపీ మునిగిపోతున్నదని పేర్కొన్నారు.