డెహ్రాడూన్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ కౌంటర్ ఇచ్చారు. నువ్వు రాజీవ్ గాంధీ కొడుకువో కాదో అని మేము ప్రూఫ్ అడిగామా అని నిలదీశారు. 2016లో పీవోకేలో ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్, 2019లో బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై వాయుసేన మెరుపు దాడులకు ఆధారాలు కావాలన్న రాహుల్ గాంధీకి ఈ మేరకు సమాధానమిచ్చారు. ‘నువ్వు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమారుడివేనా?’ అని బీజేపీ ఎప్పుడైనా డిమాండ్ చేసిందా అని అన్నారు. ఆర్మీ నుంచి సర్జికల్ స్ట్రైక్స్ ఆధారాలు డిమాండ్ చేసే హక్కు నీకు ఉన్నదా అని రాహుల్‌ను నిలదీశారు.
సర్జికల్ స్ట్రైక్స్ గురించి ఆర్మీ చెప్పిందంటే దానిపై ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయకూడదని హిమంత బిస్వా శర్మ అన్నారు. ఈ విషయాన్ని వెల్లడించిన దివంగత జనరల్ బిపిన్ రావత్‌పై నీకు నమ్మకం లేదా అని రాహుల్‌ను ప్రశ్నించారు. ఆయన చెప్పారంటే అది జరిగినట్లుగానే భావించాలన్నారు. సర్జికల్ స్ట్రైక్స్‌కు సంబంధించిన ఆధారాలు నీకు ఎందుకు అని రాహుల్‌ను ప్రశ్నించారు. దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసే సైనికులను అగౌరవపర్చవద్దని సూచించారు. ఉత్తరాఖండ్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.