న్యూఢిల్లీ : ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారన్న కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న జమ్ము కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ఉగ్రవాది యాసిన్ మాలిక్ సంచలన విషయాన్ని వెల్లడించారు. లష్కరే తాయిబా వ్యవస్థాపకుడు, 26/11 సూత్రధారి హఫీజ్ సయీద్‌ను తాను 2006లో కలిసిన తర్వాత నాటి ప్రధాని మన్మోహన్ తనకు వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలిపారని గత నెల 25న ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో మాలిక్ పేర్కొన్నారు. పాకిస్థాన్‌తో తెర వెనుక శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని భారత సీనియర్ నిఘా అధికారులు కోరడంతో తాను అతడిని కలిశానని వెల్లడించారు.
మాలిక్ ప్రకటన ప్రకారం నాటి నిఘా విభాగం ప్రత్యేక డైరెక్టర్ వీకే జోషి ఢిల్లీలో మాలిక్‌ను కలిసి పాకిస్థాన్ పర్యటనలో రాజకీయ నాయకులతో పాటు సయీద్ తదితర ప్రముఖ ఉగ్రవాదులను కలిసి ప్రధాని మన్మోహన్ సింగ్ చేస్తున్న శాంతి ప్రయత్నాలకు మద్దతు కూడగట్టాలని కోరారు. దాంతో తాను పాకిస్థాన్‌లోని ప్రముఖ ఉగ్రవాదులతో హింసపై సయోధ్య కోసం ఒత్తిడి చేశానని మాలిక్ తెలిపారు. అధికారికంగా ఆమోదించిన ఈ చొరవను ఆ తర్వాత రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించారని చెప్పారు.