Ayodhya | న్యూఢిల్లీ: అయోధ్య రామమందిర నిర్మాణానికి దేశ, విదేశాల నుంచి భక్తులు విరాళాలు ఇచ్చారు. రోజువారీ కూలీల దగ్గర్నుంచి పెద్ద వ్యాపారుల వరకు తోచినంత అయోధ్య రాముడికి భక్తితో సమర్పించుకున్నారు. దేశవ్యాప్తంగా చేపట్టిన విరాళాల సేకరణలో 20 లక్షల మంది కార్యకర్తలు 12.7 కోట్ల కుటుంబాల నుంచి రూ.2100 కోట్లు సేకరించారని వీహెచ్‌పీ లెక్కలు చెబుతున్నాయి.
భూరి విరాళం అందించిన వారిలో దిలీప్ కుమార్ వి లాఖీ, ఆయన కుటుంబం ముందు వరుసలో ఉంటుంది. సూరత్‌కు చెందిన ఈ వజ్రాల వ్యాపారి రాములోరికి 101 కేజీల బంగారాన్ని కానుకగా ఇచ్చినట్టు తెలుస్తున్నది. దీని ప్రస్తుత మార్కెట్ విలువ రూ.68 కోట్లుగా ఉంది. ఈ బంగారాన్ని రామాలయ తలుపులు, గర్భగుడి, త్రిశూలం, డమరు, పిల్లర్లకు కేటాయించారు. విరాళాల్లో ఇప్పటివరకు ఇదే అత్యధిక మొత్తం అని తెలుస్తున్నది.