Diabetes | న్యూఢిల్లీ: అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో ప్రతి 10 శాతం ఆహారం టైప్-2 మధుమేహం ముప్పును 17% పెంచుతుందని తేలింది. యూనివర్సిటీ కాలేజ్ లండన్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, ఇంపీరియల్ కాలేజ్ లండన్ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. 3,11,892 మందిని పరిశీలించారు. 10.9 సంవత్సరాలపాటు ఈ పరిశోధన జరిగింది. ఆ సమయంలో 14,236 మందికి మధుమేహం సంక్రమించింది. ఈ అధ్యయనం ప్రకారం, తక్కువ ప్రాసెస్డ్ ఆహారాన్ని తీసుకోవడం వల్ల ముప్పు తగ్గుతుంది.
అల్ట్రాప్రాసెస్డ్ ఫుడ్ (యూపీఎఫ్)ను అధికంగా వినియోగించే టాప్ 25 శాతం మంది వినియోగదారులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. వీరు తినే మొత్తం ఆహారంలో యూపీఎఫ్ 23.5 శాతం. ఈ యూపీఎఫ్లో 40 శాతం స్వీటెన్డ్ బెవరేజెస్ ఉన్నాయి. ఇవి వారు తినే మొత్తం ఆహారంలో 9 శాతం. అయితే వీరు తినే యూపీఎఫ్లో 10 శాతాన్ని తగ్గించి, దానికి బదులుగా నామమాత్రంగా ప్రాసెస్ చేసిన గుడ్లు, పాలు, పండ్లు, ఉప్పు, పెరుగు, నూనె వంటివాటిని తినిపించారు. అప్పుడు వారికి మధుమేహం ముప్పు 14 శాతం వరకు తగ్గింది.