న్యూఢిల్లీ: మధుమేహం వల్ల కీళ్ల నొప్పులు రావచ్చు. ఫలితంగా మోకాళ్లు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. మోకాళ్ల మార్పిడి శస్త్ర చికిత్స తర్వాత ఈ మధుమేహం వల్ల ఇన్ఫెక్షన్లు, రక్తం గడ్డ కట్టే ముప్పు పెరుగుతుంది. న్యూఢిల్లీలోని వర్ధమాన్ వైద్య కళాశాల, సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. మధుమేహ బాధితుల్లో సగం మందికిపైగా కీళ్ల నొప్పులతో బాధపడుతూ ఉంటారు. వీరికి భవిష్యత్తులో తుంటి లేదా మోకాలు కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్స అవసరమవుతుంది.
అడ్వాన్స్డ్ నీ ఆైర్థ్రెటిస్ రోగులకు సమర్థమైన శస్త్ర చికిత్సగా టోటల్ నీ ఆర్త్రోప్లాస్టీ (టీకేఏ)కి గుర్తింపు ఉంది. టీకేఏ తర్వాత జాయింట్ ఇన్ఫెక్షన్కు ప్రధాన కారణం మధుమేహమని ఈ అధ్యయనంలో తేలింది. టీకేఏ తర్వాత డీప్ వీన్ థ్రాంబోసిస్ (డీవీటీ) లేదా రక్తం గడ్డ కట్టడం మరొక ముప్పు అని వెల్లడైంది. దీనివల్ల అనారోగ్యం, మరణించే అవకాశం పెరుగుతుందని తెలిసింది. టీకేఏ తర్వాత ఫలితాలను మధుమేహం తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. సంక్లిష్టత పెరుగుతుంది.
శారీరక కార్యకలాపాలు, జీవన నాణ్యతలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇన్సులిన్‌తో చికిత్సను పొందే మధుమేహ రోగులు ఈ శస్త్ర చికిత్స సమయంలో, అంతకుముందు, తర్వాత 60 శాతం అధిక ప్రతికూల ప్రభావానికి గురవుతారని పరిశోధకులు చెప్పారు. టీకేఏ సమయంలో షుగర్ కంట్రోల్ లేకపోతే ఫలితాలు మరింత దయనీయంగా ఉంటాయన్నారు. టీకేఏ చేయించుకునే మధుమేహ రోగులకు పెరిప్రోస్థెటిక్ జాయింట్ ఇన్ఫెక్షన్ ముప్పు 43 శాతం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అదేవిధంగా, రక్తం గడ్డ కట్టే అవకాశం 45 శాతం అధికమని వెల్లడైందన్నారు. దవాఖానలలో తిరిగి చేరడం 28 శాతం పెరిగినట్లు చెప్పారు.