Medicine Price Hike | న్యూఢిల్లీ, మార్చి 26: ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మందుల ధరలు త్వరలో పెరగనున్నాయి. వీటిలో క్యాన్సర్, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులతోసహా ఇతర వ్యాధులకు సంబంధించిన ప్రభుత్వ నియంత్రిత మందులతోపాటు ఇతర యాంటీబయాటిక్స్ కూడా ఉన్నాయి. వీటి ధరలు 1.7 శాతం పెరిగే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి.
మందుల తయారీకి ఉపయోగించే ముడిపదార్థాల ధరలు, ఇతర ఖర్చులు పెరుగుతున్న కారణంగా మందుల ధరల పెంపు ఫార్మసీ పరిశ్రమకు ఉపశమనం కలిగించగలదని అఖిల భారత కెమిస్టులు, డ్రగ్గిస్టు సంఘం(ఏఐఓసీడీ) ప్రధాన కార్యదర్శి రాజవీ సింఘాల్ తెలిపారు. కాగా, ఫార్మా కంపెనీలు అనుమతించిన ధరల పెంపు కన్నా అధికంగా మందుల ధరలు పెంచుతూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని రసాయనాలు, ఎరువుల అధ్యయనంపై ఏర్పడిన పార్లమెంటరీ స్థాయీ సంఘం వెల్లడించింది.
ఫార్మా కంపెనీల ఉల్లంఘనలకు సంబంధించి 307 ఘటనలను ఫార్మా డ్రగ్స్ ధరలను ఖరారు చేసే నియంత్రణ సంస్థ నేషనల్ ఫార్మాస్యుటికల్ ప్రైసింగ్ అథారిటీ(ఎన్పీపీఏ) కనుగొంది. డ్రగ్ ప్రైసెస్(కంట్రోల్) ఆర్డర్(డీపీసీఓ), 2013 ప్రకారం ఫార్మసీ డ్రగ్స్‌కు ధరలపై గరిష్ఠ పరిమితి ఉంటుంది. తయారీ సంస్థలు ఈ ధరకు మించి ఉత్పత్తులను అమ్మరాదు.