NEET Row : నీట్ పరీక్షల నిర్వహణలో అవకతవకలు నిర్ధారణ అయితే బాధ్యులైన ఎన్టీఏ అధికారులను ఉపేక్షించేది లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. నీట్ పరీక్షల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు.
నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్, పరీక్షల నిర్వహణలో అధికారులు ఎవరైనా అవకతవకలకు పాల్పడినట్టు తేలితే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. సుప్రీంకోర్టు సూచనలకు అనుగుణంగా 1563 మంది అభ్యర్ధులకు తిరిగి పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
రెండు చోట్ల అక్రమాలు జరిగాయని గుర్తించామని, ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని తెలిపారు. ఎన్టీఏ ఉన్నతాధికారులు ఎవరైనా దోషులుగా తేలితే వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోకతప్పదని తేల్చిచెప్పారు.
ఎన్టీఏలో ప్రక్షాళన అవసరమని, ఈ దిశగా చర్యలు చేపడతామని, తప్పులు చేసినవారు చర్యల నుంచి తప్పించుకోలేని విధంగా కార్యాచరణకు దిగుతామని వెల్లడించారు. నీట్ యూజీ 2024లో గ్రేస్ మార్కులు పొందిన విద్యార్ధుల ముందు రెండు మార్గాలున్నాయని, ఈనెల 23న మళ్లీ పరీక్ష రాసి జూన్ 30 నాటికి నూతన స్కోర్ పొందడం లేదా గ్రేస్ మార్కులు లేకుండా గతంలో సాధించిన స్కోర్‌ను ఆమోదించాలని స్పష్టం చేశారు. ఇక నీట్ పరీక్షల ప్రశ్నాపత్రం లీకేజ్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.
Read More :
సల్మాన్ హత్యకు స్కెచ్ : యూట్యూబ్ వీడియోలో చర్చించిన వ్యక్తి అరెస్ట్