న్యూఢిల్లీ, ఆగస్టు 14: ధర్మస్థల ఆలయ పాలకుల ఆదేశం మేరకే ఒకే ప్రదేశంలో 70-80 మృతదేహాలను తానే స్వయంగా పాతిపెట్టానని ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో ప్రధాన సాక్షి, హక్కుల కార్యకర్త వెల్లడించారు. ధర్మస్థల ఆలయ పాలనా యంత్రాంగం కింద పారిశుద్ధ్య కార్మికుడిగా గతంలో పనిచేసిన హక్కుల కార్యకర్త ఇండియా టుడేకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో అనేక సంచలన విషయాలు బయటపెట్టారు. ఎటువంటి మరణ ధ్రువీకరణ పత్రాలు లేకుండా అటవీ ప్రాంతంలో తానే అనేక మృతదేహాలను గొయ్యితీసి పాతిపెట్టినట్లు తెలిపారు.
గడచిన రెండు దశాబ్దాలలో ఆలయ పర్యవేక్షకుల ఒత్తిడిపైన పిల్లలు, మహిళలతోసహా పదుల సంఖ్యలో మృతదేహాలను తానే ఖననం చేసినట్లు ఆయన పోలీసులకు వెల్లడించిన తర్వాత ఈ కేసు వెలుగుచూసింది. దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం కావడంతో కర్ణాటకలోని ధర్మస్థల పట్టణం పతాక శీర్షికలకు ఎక్కింది. ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు 15 ప్రదేశాలలో తవ్వకాలు జరపగా సైట్ నంబర్ 6లో మాత్రం ఓ మానవ అస్థిపంజరం కనిపించింది. సైట్ నంబర్ 13లో తాను 70-80 మృతదేహాలను పాతిపెట్టినట్లు సాక్షి వెల్లడించారు. తాము చాలా లోతుగా తవ్వి మృతదేహాలను పాతిపెట్టామని ఆయన చెప్పారు.