DGMOs talks : భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల డీజీఎంవోల (DGMOs) చర్చలు ముగిశాయి. రెండు దేశాల డీజీఎంవోలు హాట్‌లైన్ (Hotline) ద్వారా చర్చలు జరిపారు. వాస్తవానికి ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం డీజీఎంవోలు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకే చర్చలు జరగాల్సి ఉంది. కానీ కారణం ఏమిటో తెలియదుగానీ చర్చలను సాయంత్రం 5 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ఇవాళ మధ్యాహ్నం ప్రకటించారు.
ఆ మేరకు సాయంత్రం 5 గంటలకు మొదలైన డీజీఎంల చర్చలు కాసేపటి క్రితమే ముగిశాయి. భారత డీజీఎంవో రాజీవ్ ఘాయ్, పాకిస్థాన్ డీజీఎంవో కాశీఫ్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. కాల్పుల విరమణకు ఇరుదేశాలు అంగీకారం తెలిపిన అనంతర పరిస్థితులు, కాల్పుల విరమణ విధివిధానాలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. హాట్లైన్లో ఇంకా ఏం చర్చించారనే వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా ఏప్రిల్ 22న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం సమీపంలోగల బైసరన్ లోయలో పర్యాటకులే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు. ఆ కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకు ప్రతీకారంగా భారత్ పాక్‌లోని, పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో సర్జికల్స్ స్ట్రైక్స్ చేసింది. అదే సమయంలో పాకిస్థాన్ సైన్యం అత్యుత్సాహంతో భారత్‌పై దాడులకు పాల్పడింది. ఈ దాడులను భారత్ సమర్థంగా తిప్పికొట్టింది.
రెండు దేశాల మధ్య దాడులు, ప్రతి దాడులతో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ డీజీఎంవో భారత డీజీఎంవోకు కాల్పుల విరమణ ప్రతిపాదన చేశారు. అందుకు భారత్ కూడా అంగీకరించింది. సోమవారం మధ్యాహ్నం డీజీఎంవోలు చర్చలకు ప్లాన్ చేశారు. అయితే మధ్యాహ్నం జరగాల్సిన చర్చలు సాయంత్రానికి వాయిదాపడ్డాయి. సాయంత్రం ఇరుదేశాల డీజీఎంలోలు చర్చలు జరిపారు.