DGCA | ఆల్కెమిస్ట్ ఏవియేషన్ విమాన శిక్షణ లైసెన్స్‌ను డీజీసీఏ రద్దు చేసింది. ఇటీవల సదరు ఏవియేషన్ సంస్థకు చెందిన ట్రైనీ విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇన్స్ట్రక్టర్ పైలట్, ట్రైనీ పైలట్ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అనంతరం డీజీసీఏ ఆల్కెమిస్ట్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రత్యేక భద్రతా ఆడిట్‌ను నిర్వహించింది. ఇందులో చాలా తీవ్రమైన లోపాలు కనిపించాయి. ఈ క్రమంలో శిక్షణ లైసెన్స్‌ని నిలిపివేయాలని నిర్ణయించినట్లు డీజీసీఏ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.
ఆల్కెమిస్ట్ ఏవియేషన్ జార్ఖండ్‌లోని జంషెడ్పూర్ సోనారీ విమానాశ్రయంలో విమానాలను నడుపుతోంది. ఈ నెల 20న జార్ఖండ్‌లో సోనారి విమానాశ్రయం నుంచి శిక్షణ విమానం టేకాఫ్ అయ్యింది. ఆ తర్వాత విమానం ఆచూకీ గల్లంతైంది. ఆ తర్వాత చండిల్ డ్యామ్ రిజర్వాయర్‌లో విమాన శకలాలను గుర్తించారు. ఎన్డీఆర్ఎఫ్, నేవీ సహాయంతో రిజర్వాయర్ నుంచి విమాన శకలాలను తొలగించారు. ఈ ప్రమాదంలో ట్రైనీ పైలట్ సుబ్రోదీప్ దత్, పైలట్ కెప్టెన్ జీత్ సత్రు ఆనంద్ మృతి చెందారు. ప్రమాదానికి గురైన విమానం ‘సెస్నా 152’గా గుర్తించారు.