DGCA : డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కమర్షియల్ ఫ్లైట్స్‌కు కీలక సూచన చేసింది. రక్షణ శాఖ (Defence Ministry) వైమానిక స్థావరాల్లో (Air bases) విమానాలు టేకాఫ్ (Take off) , ల్యాండింగ్ (Landing) సమయంలో విండో షేడ్స్ (కిటికీలను కవర్ చేసే వస్త్రాలు – Window shades) ను మూసివేయాలని ఆదేశించింది. మరీ ముఖ్యంగా పాక్‌తో సరిహద్దు ఉన్న పశ్చిమ భారత స్థావరాల వద్ద ఈ సూచన తప్పక పాటించాలని పేర్కొంది. విమానం టేకాఫ్ అయిన తర్వాత 10 వేల అడుగుల ఎత్తుకు వెళ్లేవరకు, ల్యాండింగ్ సమయంలో ఈ ఎత్తుకు దిగిన తర్వాత ఈ కొత్త నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. ఎమర్జెన్సీ విండోస్ దగ్గర మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉందని తెలిపింది.
ఇటీవల భారత్ – పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు నరమేథానికి పాల్పడ్డారు. ఏకంగా 26 మంది పర్యాటకులను కాల్చిచంపారు. ఆ ఉగ్రదాడికి ప్రతిగా భారత బలగాలు ఆపరేషన్ సిందూర్ పేరుతో సర్జికల్ స్ట్రైక్స్ చేసి గట్టి బదులిచ్చాయి. అది జీర్ణించుకోలేని పాకిస్థాన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటంతో భారత్ తిప్పికొట్టింది. దాంతో దడిసిన పాకిస్థాన్ రాజీకి వచ్చింది. ఫలితంగా రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దాంతో ఘర్షణ వాతావరణం సద్దుమణిగింది.
అయితే రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో డీజీసీఏ తాజా సూచనలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అదేవిధంగా సైనిక స్థావరాల వద్ద ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీపై ఉన్న నిషేధం గురించి కూడా ప్రయాణికులను అప్రమత్తం చేయాలని డీజీసీఏ సూచించింది. వాటిని ఉల్లంఘిస్తే ఎదుర్కోవాల్సిన చర్యల గురించి వెల్లడించాలని విమానయాన సంస్థల నిర్వాహకులకు స్పష్టంచేసింది. ఆపరేషనల్ సేఫ్టీతోపాటు ప్రయాణికులు తమకు తెలియకుండానే రక్షణపరమైన సమాచారాన్ని షేర్ చేయకుండా నిరోధించేందుకే ఈ చర్యలని తన ప్రకటనలో పేర్కొంది.
లేహ్, శ్రీనగర్, జమ్ము, పఠాన్‌కోట్, ఆదంపుర్, చండీగఢ్, బఠిండా, జైసల్మేర్, నాల్, జోధ్‌పూర్, హిండన్, ఆగ్రా, కాన్పూర్, బరేలీ, మహారాజ్‌పుర్, గోరఖ్‌పూర్, భుజ్, లొహెగావ్, డాబోలిమ్ (గోవా), వైజాగ్‌లోని విమానాశ్రయాలు ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించాల్సి ఉంది.