న్యూఢిల్లీ : కరోనా కేసులు మళ్లీ అధికమవుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. విమాన ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరి చేస్తూ డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ లేని ప్రయాణికులను బోర్డింగ్‌కు ముందే ఆపాలని ఆదేశించింది. ప్రయాణ సమయమంతా మాస్క్ ధరించి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. మాస్క్ లేకుంటే ఎయిర్‌పోర్టులోకి అనుమతించొద్దని సూచించింది. ఈ మేరకు పౌర విమానయాన శాఖ సీఐఎస్ఎఫ్కు తాజాగా మార్గదర్శకాలు పంపింది.
కొవిడ్ భద్రతా చర్యలను పాటించేందుకు నిరాకరించే విమాన ప్రయాణికులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీవలే ఢిల్లీ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి ప్రభావం ముగియలేదని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలకు కోర్టు ఆదేశించింది. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేదా డీజీసీఏ మార్గదర్శకాల ప్రకారం చర్య తీసుకోవాలని ఆదేశించిన విషయం విదితమే.
దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. మంగళవారం 3714 కేసులు నమోదవగా, బుధవారం నాటికి ఆ సంఖ్య 5,233కు పెరిగింది. ఇది నిన్నటికంటే 41 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,31,90,282కు చేరాయి. ఇందులో 4,26,36,710 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,715 మంది మృతిచెందగా, 28,857 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో ఏడుగురు మరణించగా, 1881 మంది డిశ్చార్జీ అయ్యారు.
కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 1881 కేసులు ఉన్నాయి. ఇందులో 1242 కేసులు ముంబైకి చెందినవేనని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక కేరళలో 1494, ఢిల్లీలో 450, కర్ణాటకలో 348, హర్యానాలో 227 కేసులు ఉన్నాయి.