Uttar Pradesh | లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఘోరం జరిగింది. శ్రావణ పూర్ణిమ సందర్భంగా ఆత్మ విశ్వేశ్వర్ మహాదేవ్ ఆలయంలో ఏర్పాటు చేసిన హారతి కార్యక్రమంలో మంటలు చెలరేగాయి. దీంతో తొక్కిసలాట జరిగింది. పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
శ్రావణ పూర్ణిమ సందర్భంగా శనివారం రాత్రి ఆత్మ విశ్వేశ్వర్ మహాదేవ్ ఆలయంలో హారతి కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులకు హారతి ఇస్తుండగా.. ఆలయంలో కాటన్‌తో డెకరేషన్ చేసిన వాటికి మంటలు అంటుకున్నాయి. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన భక్తులు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో కొందరికి మంటలు అంటుకున్నాయి.
అప్రమత్తమైన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాలిన గాయాలతో బాధపడుతున్న వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. వీరందరూ ప్రాణాలతో బయటపడినట్లు పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో పూజారితో పాటు 30 మంది భక్తులు ఆలయంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాటన్‌తో ఆలయాన్ని డెకరేట్ చేయడం వల్లే హారతి వెలిగించిన సమయంలో మంటలు అంటుకుని చెలరేగాయని పోలీసులు నిర్ధారించారు.