ముంబై : మహారాష్ట్ర మాజీ సీఎం, విపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు ఇతర బీజేపీ నేతలను బుధవారం ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని మెట్రో సినిమా వద్ద దేవేంద్ర ఫడ్నవీస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని బీజేపీ ప్రతినిధి సురేష్ నఖువ ట్వీట్ చేశారు.
మనీల్యాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు ఎదుర్కొంటున్న రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ఫడ్నవీస్‌తో పాటు పలువురు బీజేపీ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహిస్తుండగా వారిని పోలీసులు నిర్భందించి ఆ తర్వాత కొద్దిసేపటికి విడుదల చేశారు. బీజేపీ నేతలపై కుట్రకు సంబంధించిన పెన్ డ్రైవన్‌ను ఫడ్నవీస్ అసెంబ్లీ స్పీకర్‌కు సమర్పించిన కొద్దిగంటలకే ఈ ఘటన జరిగింది.
మహా వికాస్ అఘడి నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్ధల విచారణ సాగుతున్న క్రమంలో ఫడ్నవీస్ అరెస్ట్ పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో బీజేపీ నేతలకు వ్యతిరేకంగా ఎంవీఏ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఫడ్నవీస్ ఆరోపిస్తున్నారు. ఫడ్నవీస్ వ్యాఖ్యలపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. ఫడ్నవీస్ ఆరోపణలకు ఆధారంగా ఇచ్చిన వీడియో కచ్చితత్వాన్ని నిర్ధారించాల్సి ఉందని పవార్ పేర్కొన్నారు.