హైదరాబాద్ : పాల(Milk)ను కల్తీ చేసేందుకు డిటర్జెంట్లు(Detergents), యూరియా(Urea), హైడ్రోజన్ పెరాక్సెడ్ (Hydrogen peroxide) వంటి హానికారక పదార్థాలు వాడుతున్నట్టు కేంద్రం తెలిపింది. పాల నాణ్యతపై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో 4 శాతం కల్తీ అయినట్టు తేలిందని వెల్లడించింది. పార్లమెంట్లో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చింది.
ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) గతంలో దేశవ్యాప్తంగా 1103 పట్టణాల్లో పాల నాణ్యతపై సర్వే చేసినట్టు తెలిపింది. పాల ఉత్పత్తి కంపెనీలు, డెయిరీలు, స్థానిక వ్యాపారుల దగ్గరి నుంచి మొత్తం 6,432 శాంపిళ్లను సేకరించి పరీక్షించినట్టు పేర్కొన్నది. ఇందులో మొత్తం 246 శాంపిళ్లలో కల్తీలు ఉన్నట్టు తేలిందని చెప్పింది. అత్యధికంగా చిక్కదనం కోసం మాల్టోడెక్స్ట్రిన్ (గోధుమ పిండి, వరి పిండి, మక్కపిండి వంటి పిండి పదార్థాలు), రుచి కోసం చక్కర వంటివి కలుపుతున్నట్టు తేలింది.
వీటితోపాటు హైడ్రోజన్ పెరాక్సెడ్ వంటి రసాయనాలు, డిటర్జెండ్లు, యూరియా వంటి హానికర పదార్థాలు కలుపుతున్నట్టు గుర్తించామని తేల్చి చెప్పింది. పాలల్లో కల్తీని గుర్తించేందుకు సీఎస్ఐఆర్కు చెందిన సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ( CWWRI ) కొత్త విధానాన్ని కనుగొన్నట్టు కేంద్రం తెలిపింది. ఎలక్ట్రో కెమికల్ విధానంలో 10 సెకండ్ల కన్నా తక్కువ సమయంలోనే కల్తీని గుర్తించవచ్చని పేర్కొన్నది.