న్యూఢిల్లీ: ప్రజల ఆరోగ్యం కోసం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రత్యేకంగా సెస్సును వసూలు చేస్తున్నప్పటికీ సెస్సు విధించడానికి ముందు ఆరోగ్యంపై పెట్టిన ఖర్చు కన్నా తక్కువ ఖర్చు ఇప్పుడు చేస్తున్నది. మొత్తం బడ్జెట్లో ఆరోగ్య రంగానికి కేటాయిస్తున్న వాటా, జీడీపీలో నిష్పత్తితో పోలిస్తే చాలా తక్కువ మొత్తాన్ని కేంద్రం ఖర్చు చేస్తున్నది. 2018లో ఆరోగ్య సెస్సు విధించడానికి ముందు 2017-18లో మొత్తం ప్రభుత్వ వ్యయంలో ఆరోగ్య శాఖకు 2.4% కేటాయింపులు జరిపింది. 2026-27లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు జరిపిన కేటాయింపుల కన్నా 30 శాతానికి పైగా ఆరోగ్య సెస్సు పేరిట ప్రభుత్వం వసూలు చేసింది. సెస్సును పక్కనపెడితే మొత్తం బడ్జెట్లో ఆరోగ్య శాఖకు కేవలం 1.3% కేటాయింపులే జరిగాయి. 2017-18 సంఖ్యతో పోలిస్తే ఇది సగం కూడా లేదు. ఆరోగ్య సెస్సును ప్రవేశపెట్టిన సమయంలో ప్రభుత్వం జరుపుతున్న కేటాయింపుల కన్నా అధిక మొత్తంలో ఆరోగ్య రంగం కోసం ఖర్చు పెడతారని అందరూ భావించారు. అయితే అలా జరుగలేదు.