PM Modi | గాంధీనగర్, మార్చి 28: దశాబ్దాలుగా బీజేపీ పాలిస్తున్నప్పటికీ గుజరాత్లో వైద్య రంగం అస్తవ్యస్తంగా ఉంది. ‘అక్కడి దవాఖానల్లో వైద్యులు, నర్సులు సరిపడా లేరు. కనీసం రోగులకు అవసరమైన పడకలు కూడాలేవు. సమగ్రమైన ఆరోగ్య విధానం లేక, ఆరోగ్య రంగమంతా అనేక లోపాలతో నిండి ఉంది.’అని భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తీవ్రంగా వ్యాఖ్యానించింది. ముఖ్యంగా అత్యవసర విభాగాలైన ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లు, బ్లడ్ బ్యాంక్‌లలో కూడా సేవలు సరిగ్గా లేవంటూ పలు లోపాలను ఎత్తిచూపింది. ఆరోగ్య సేవల ప్రజారోగ్య మౌలిక సదుపాయాలపై కాగ్ తన నివేదికను శుక్రవారం అసెంబ్లీ ముందు ఉంచింది.
రాష్ట్రంలో 22 జిల్లాల్లో 25 శాతం డాక్టర్లు, 19 జిల్లాల్లో 25 శాతం కన్నా ఎక్కువ పారా మెడికల్ సిబ్బంది కొరత ఉన్నట్టు కాగ్ తన నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం బడ్జెట్లో ఈ రంగానికి 5.4 శాతం నిధులు ఇచ్చారని, అయితే జాతీయ ఆరోగ్య విధానం సిఫార్సు మేరకు రాష్ట్ర బడ్జెట్లో ఆరోగ్య రంగానికి 8 శాతం నిధులు కేటాయించాలని కాగ్ సూచించింది. మానవ వనరుల నిర్వహణకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఎలాంటి విధానాన్ని రూపొందించ లేదని కాగ్ తప్పు బట్టింది.
2016-22 మధ్య 9,983 మంది ఆరోగ్య సిబ్బందిని నియమించినప్పటికీ డాక్టర్లు, నర్సులు, పారా సిబ్బంది కొరత వరుసగా 23, 6, 25 శాతం ఉందని తెలిపింది. ప్రత్యేక డాక్టర్ పోస్టులు సబ్ డిస్ట్రిక్స్ దవాఖానలలో 51 శాతం, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలలో 49 శాతం ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. ఇక జాతీయ ఆరోగ్య మిషన్ పథకం కింద 31 శాతం ప్రత్యేక డాక్టర్లు, 32 శాతం పారా మెడికల్ సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాలేజీలు/స్కూళ్లలో 76 శాతం బోధనా సిబ్బంది కొరత ఉందని కాగ్ తెలియజేసింది.