న్యూఢిల్లీ: డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్(Gurmeet Ram Rahim)కు సుప్రీంకోర్టు ఇవాళ నోటీసులు జారీ చేసింది. 2002లో జరిగిన డేరా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ మర్డర్ కేసులో గుర్మీత్‌తో పాటు మరో నలుగురికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. ఆ కేసు నుంచి గుర్మీత్ పేరును తొలగించాలని పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సీబీఐ సవాల్ చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. జస్టిస్ బేలా ఎం త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారిస్తున్నదని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం తెలిపింది. బేలా త్రివేది బెంచ్ ముందుకు ఈ కేసును పంపనున్నట్లు చెప్పారు.
హర్యానాలోని కురక్షేత్రలో ఉన్న ఖాన్పుర్ కాలనీలో 2002, జూలై 10వ తేదీన రంజిత్ సింగ్ హత్యకు గురయ్యాడు. అనేక మంది మహిళలపై గుర్మీత్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రాసి ఉన్న ఓ లేఖను రంజిత్ సింగ్ సర్క్యూలేట్ చేసినట్లు అనుమానాలు ఉన్నాయి. ఆ మర్డర్ కేసులో పంచకుల సీబీఐ కోర్టు 2021లో రామ్ రహీమ్‌తో పాటు మరో నలుగుర్ని దోషులుగా ప్రకటించింది. అయిదుగురికి జీవితఖైదు శిక్ష వేసింది. గుర్మీత్‌కు 31 లక్షల జరిమానా కూడా విధించారు.