కోరాపుట్: ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ఉన్న జేయ్పోర్ డిప్యూటీ రేంజర్ రామ చంద్ర నేపాక్ ఇండ్లపై ఇవాళ విజిలెన్స్ అధికారులు దాడులు (Vigilance Raids)చేపట్టారు. ఆ తనిఖీల్లో ఆ ఆఫీసర్ ఇంట్లో సుమారు 1.4 కోట్ల నగదు దొరికింది. అతని అపార్ట్మెంట్లోని ఓ రహస్య ట్రెజరీలో ఆ నగదును దాచాడతను. ఫారెస్ట్ ఆఫీసర్ రామచంద్ర నుంచి నగదుతో పాటు నాలుగు బంగారు బిస్కెట్లు, 16 బంగారు నాణాలు రికవరీ చేశారు. మొత్తం ఆరు ప్రదేశాల్లో ఇవాళ ఒడిశా విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులను సంపాదించినట్లు ఆ ఆఫీసర్‌పై ఆరోపణలు ఉన్నాయి.
విజిలెన్స్ శాఖ స్పెషల్ జడ్జి ఇచ్చిన సెర్చ్ వారెంట్‌తో అధికారులు ఆ ఆఫీసర్ ఇండ్లల్లో తనిఖీలు చేశారు. ఆరుగురు డీఎస్పీలు, అయిదుగురు ఇన్స్పెక్టర్లు, 9 మంది ఏఎస్ఐలు, ఇతర సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొన్నారు. అన్ని చోట్ల నుంచి సుమారు 1.4 కోట్ల నగదును సీజ్ చేశారు. ప్రస్తుతం ఇంకా తనిఖీలు కొనసాగుతున్నట్లు అధికారులు చెప్పారు. సోదాలు ముగిసిన తర్వాత సమగ్రమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వనున్నట్లు చెప్పారు.
జేయ్పోర్ పట్టణంలోని గోల్డెన్ హైట్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ లో ఉన్న ఫ్లాట్ నెంబర్ 510లోని ఓ సీక్రెట్ లాకర్లో 1.4 కోట్ల నగదును సీజ్ చేసినట్లు ఒడిశా విజిలెన్స్ అధికారులు చెప్పారు.