Latha Kumari : ఓ ఐఏఎస్ అధికారిణి (IAS officer) హసనాంబ ఆలయం (Hasanamba Temple) లో నిప్పులపై నడిచి తన భక్తిని చాటుకున్నారు. హసన్ జిల్లా (Hassan district) డిప్యూటీ కమిషనర్ (Deputy Commissioner) కేఎస్ లతా కుమారి (KS Latha Kumari).. ప్రసిద్ధ హసనాంబ ఆలయంలో జరిగిన అగ్నిగుండం (కెండోత్సవం) కార్యక్రమంలో పాల్గొని, నిప్పులపై నడిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిప్పు కణికలపై నడిచినందుకు భక్తుల నుంచి ఆమెకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
హసనాంబ ఆలయ వార్షికోత్సవాలు బుధవారం రాత్రితో ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా గురువారం ఉదయం ఆలయ ప్రాంగణంలో సంప్రదాయబద్ధంగా ‘కెండోత్సవం’ నిర్వహించారు. ఏడాదిపాటు ఆలయ గర్భగుడిని మూసివేసే ముందు ఈ క్రతువును జరపడం ఆనవాయతీ. ఈ కార్యక్రమంలో డీసీ లతా కుమారి స్వయంగా పాల్గొని, కణకణలాడే నిప్పులపై చెప్పులు లేకుండా నడిచారు. గులాబీ రంగు చుడీదార్ ధరించిన ఆమె, నిప్పులపై నడుస్తున్నప్పుడు అక్కడున్న భక్తులు పెద్దఎత్తున హర్షధ్వానాలు చేశారు.
అనంతరం లతా కుమారి మీడియాతో మాట్లాడుతూ.. భక్తులు పవిత్ర కలశాలు పట్టుకుని నిప్పులపై నడుస్తుండటం చూసి తనకు స్ఫూర్తి కలిగిందని చెప్పారు. ఇంతకుముందెప్పుడూ తాను ఇలా నిప్పులపై నడవలేదని తెలిపారు. మొదట కొంచెం భయపడ్డానని, కానీ దేవుడిపై విశ్వాసంతో దండం పెట్టుకుని నడిచేశానని అన్నారు. తనకేమీ కాలేదని చెప్పారు. కాగా కర్ణాటకలోని హసన్ జిల్లాలో 13 రోజులపాటు జరిగిన చారిత్రక హసనాంబ జాతరకు విశేష స్పందన లభించింది.
సినీ, రాజకీయ ప్రముఖులతో సహా సుమారు 26 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్లు, లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా ఆలయానికి దాదాపు రూ.20 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. భక్తుల సంఖ్య, ఆదాయంపై అధికారులు ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
కాగా హసనాంబ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏడాది పాటు మూసి ఉంచే గర్భగుడిలో పెట్టిన నైవేద్యాలు, పువ్వులు మరుసటి ఏడాది తలుపులు తెరిచే వరకు తాజాగా ఉంటాయని, అలాగే గర్భగుడిలోని దీపం కూడా ఏడాది పొడవునా వెలుగుతూనే ఉంటుందని భక్తులు బలంగా విశ్వసిస్తారు.