బెంగళూరు: ఈ ఏడాది చివరిలో ముఖ్యమంత్రి మార్పు జరగవచ్చంటూ వచ్చిన పత్రికా కథనాలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శనివారం స్పందించారు. తనకు ఎటువంటి తొందర లేదని, తన తలరాత ఏమిటో తనకు తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. నగరంలోని లాల్ బాగ్ వద్ద ప్రజలతో ముచ్చటించేందుకు వచ్చిన డీకే పత్రికా కథనాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
కొన్ని మీడియా చానెళ్లు వాస్తవాలను వక్రీకరించి సంచలనాత్మక కథనాలకు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునేందుకు తనకు సమయం దగ్గరపడుతోంది అని తాను ప్రకటించినట్లు వచ్చిన వార్తలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది నవంబర్ నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి రెండున్నరేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సీఎం, మంత్రివర్గ మార్పు ఉండవచ్చంటూ మీడియాలో ఊహాగానాలు సాగుతున్నాయి.