న్యూఢిల్లీ, నవంబర్ 17 : డెన్మార్క్ భామ విక్టోరియా కెజార్ హెల్విగ్(21) ఈ ఏడాది విశ్వ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఈ అంతర్జాతీయ అందాల పోటీలో తన దేశానికి మొదటిసారి విజయాన్ని అందించారు. శనివారం రాత్రి మెక్సికోలోని అరెనా నగరంలో జరిగిన విశ్వ సుందరి 73వ ఎడిషన్‌లో 120 మందికి పైగా అందగత్తెలు పోటీపడ్డారు. మిస్ నైజీరియా చిడిమ్మ అడెట్స్హినా రెండో స్థానంలో, మిస్ మెక్సికో మరియా ఫెర్నాండా బెల్ట్రాన్ మూడో స్థానంలో నిలిచారు. ‘ఒక కొత్త శకం ప్రారంభమైంది! డెన్మార్క్‌కు, మన 73వ విశ్వ సుందరికి అభినందనలు. ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు స్ఫూర్తి, సాధికారత కలిగించేలా మీ ప్రయాణం సాగాలని కోరుకుంటున్నాం.#73వ విశ్వ సుందరి పోటీలు’ అని మిస్ యూనివర్స్ అధికార ఇన్స్టాగ్రామ్ పేజీ పోస్ట్ పేర్కొంది. విక్టోరియా జంతు సంరక్షణ కార్యకర్తగా, వజ్రాల వ్యాపారంలో ఉద్యోగిగా ఉన్నారు. ఈ పోటీలో భారత సుందరి రియా సింఘా టాప్-30 లిస్ట్‌లో నిలిచారు.