తిరువనంతపురం: ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు అధికారిక వాహనాన్ని పంచాయతీ కార్యదర్శి నిరాకరించారు. ఈ నేపథ్యంలో పంచాయతీ నేత సుమారు 30 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు నిరసన తెలిపారు. (Panchayat Leader Cycles 30 Km) కేరళలోని కొల్లం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదిచనల్లూర్ గ్రామ పంచాయతీ అధ్యక్షుడిగా ఉన్న సీపీఐ నేత జినోజీ ఎడ్వర్డ్, కొల్లంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉన్నది.
కాగా, పంచాయతీ కార్యదర్శితో వివాదం నేపథ్యంలో ఆయనకు అధికార వాహనాన్ని సమకూర్చలేదు. ఈ నేపథ్యంలో ఆదిచనల్లూర్ నుంచి కొల్లం వరకు దాదాపు 15 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కి ఆ కార్యక్రమంలో ఎడ్వర్డ్ పాల్గొన్నారు. ఇదే తన అధికార వాహనమని ఆయనపేర్కొన్నారు. ఆ తర్వాత మళ్లీ సైకిల్‌పై అంతదూరం ప్రయాణించి తన గ్రామానికి చేరుకున్నారు.
మరోవైపు తన వార్డులో తారు మిక్సింగ్ యూనిట్‌కు సంబంధించిన వివాదమే వాహన నిరాకరణకు కారణమని ఎడ్వర్డ్ ఆరోపించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శిపై చర్య తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర మంత్రి బిందు కృష్ణకు ఆయన ఫిర్యాదు చేశారు.