Foxconn | న్యూఢిల్లీ: తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో ఉన్న ఫాక్స్‌కాన్ ఇండియా ఆపిల్ ఐఫోన్ ప్లాంట్‌లో వివాహిత మహిళలకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని వచ్చిన వార్తలపై కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ స్పందించింది. దీనిపై సవివరమైన నివేదికను సమర్పించాలని రాష్ట్ర కార్మిక శాఖను కోరింది. ఉద్యోగ నియామకాల ప్రక్రియలో స్త్రీ, పురుష కార్మికుల మధ్య ఎటువంటి వివక్ష చూపరాదని గుర్తు చేసింది.
ఐఫోన్ అసెంబ్లీ ప్లాంట్‌లో వివాహిత మహిళలకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఓ వార్తా సంస్థ సర్వేలో వెల్లడైంది. వివాహిత మహిళలకు కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయని, అందుకే వారికి ఉద్యోగాలు ఇవ్వడం లేదని తెలిసింది. ఫాక్స్‌కాన్ ముందుగానే అభ్యర్థుల వివరాలను తెలుసుకుని, వివాహిత మహిళలను పక్కన పెడుతున్నట్లు స్పష్టమైంది.
విద్యాసంస్థలో హిజాబ్‌పై నిషేధం సబబే
ముంబై: విద్యార్థినుల బురఖా, హిజాబ్ ధారణపై బాంబే హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. బురఖా, హిజాబ్‌లపై ఒక విద్యాసంస్థ విధించిన నిషేధాన్ని బాంబే హైకోర్టు సమర్థిస్తూ, అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఎంతమాత్రం కాదని స్పష్టం చేసింది.
ఒక విద్యా సంస్థను క్రమశిక్షణతో నిర్వహించడంలో భాగంగా విధించిన డ్రెస్ కోడ్ అమలు చేయడం కాలేజీ ప్రాథమిక హక్కు అని డివిజన్ బెంచ్ జస్టిస్‌లు ఏఎస్ చందూర్కర్, రాజేశ్ పాటిల్ బుధవారం తీర్పు చెప్పారు. కాలేజీ విధించిన డ్రెస్ కోడ్‌ను కులం, మతంతో సంబంధం లేకుండా అందరి విద్యార్థులకు అమలు చేయాల్సిందేనని పేర్కొంది.