Supreme Court | ఓ కేసు విచారణ సమయంలో సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. హీట్ వేవ్స్ సమయంలో జాతీయ స్థాయిలో మార్గదర్శకాలు జారీ చేయాలని, ఆ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం కేంద్ర హోంమంత్రిత్వశాఖ, పర్యావరణ మంత్రిత్వశాఖ, అటవీ-వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ, జాతీయ విపత్తు నియంత్రణ శాఖలకు నోటీసులు జారీ చేస్తూ రెండువారాల్లోగా సమాధానం ఇవ్వాలని కోరింది. పర్యావరణ కార్యకర్త విక్రాంత్ టోంగడ్ ఈ పిటిషన్‌ను దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. గత సంవత్సరం హీట్‌వేవ్స్, హీట్ స్ట్రెస్ కారణంగా 700 కంటే ఎక్కువ మంది మరణించారని పిటిషన్లో పేర్కొన్నారు. హీట్‌వేవ్స్ అంచనా, హీట్ వార్నింగ్, 24 గంటల హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని పిటిషనర్ డిమాండ్ చేశారు.
ఈ ఏడాది ఎక్కువ రోజులు హీట్‌వేవ్స్ ఉంటాయని అంచనా వేసినట్లు పిటిషనర్ తరఫున న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. గతంలో వడగాలులు వాయువ్య, మధ్య భారతదేశంలో మాత్రమే వీచేవని.. కానీ ఇప్పుడు తూర్పు తీరం, ఈశాన్య ద్వీపకల్పం, దక్షిణ మధ్య ప్రాంతాల్లో భారీగానే ప్రభావం కనిపిస్తుందని పేర్కొన్నారు. జాతీయ మార్గదర్శకాలు-హీట్‌వేవ్స్ నివారణ నిర్వహణ 2019 ఉన్నప్పటికీ, అనేక రాష్ట్రాలు కార్యాచరణ ప్రణాళికను అమలు చేయలేదని పిటిషన్లో పేర్కొన్నారు. విపత్తు నిర్వహణ చట్టం 2005లోని సెక్షన్ 35 ప్రకారం కేంద్రం చట్టబద్ధమైన బాధ్యతలను కూడా పిటిషన్లో ఉదహరించారు దీని ప్రకారం.. ప్రభుత్వం విపత్తు నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పిటిషన్లో ఒక అధ్యయనాన్ని ఉదహరించారు. వాతావరణ మార్పుల కారణంగా వేడి పెరగడంతో మరణాల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధ్యయనం హెచ్చరించింది.