(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ, సామాజిక భద్రత కల్పించాలంటూ దేశవ్యాప్తంగా గిగ్‌వర్కర్లు గురువారం సమ్మెకు దిగారు. దీంతో ఈకామర్స్, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ, దాని అనుబంధ సంస్థ ఇన్‌స్టామార్ట్, జొమాటో తదితర యాప్ సేవల్లో తీవ్ర అంతరాయం నెలకొన్నది. క్రిస్మస్ పర్వదినంనాడు గిగ్ వర్కర్లు సమ్మెకు దిగడంతో తాము అవసరమైన పండుగ వస్తువులను కొనుగోలు చేయలేకపోయామని ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, తిరువనంతపురం, పనాజీ తదితర నగరాల్లోని పలువురు సోషల్‌మీడియా వేదికగా కామెంట్లు చేశారు. స్విగ్గీ-ఇన్‌స్టామార్ట్, జెప్టో, బ్లింకిట్‌లో తమ ఆర్డర్లను క్యాన్సిల్ చేసినట్టు మరికొందరు వాపోయారు.
గిగ్ వర్కర్ల డిమాండ్లు ఇవే ఎలాంటి భద్రత లేకుండా రద్దీ రోడ్లపై డెడ్లైన్లతో పనిచేసే గిగ్ వర్కర్లకు ప్రమాద బీమా, ఆరోగ్య భద్రత కల్పించాలని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ (ఐఎఫ్ఏటీడబ్ల్యూ) ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఒక్కో డెలివరీ మధ్య విశ్రాంతి సమయం ఇవ్వాలని, ప్రోత్సాహకాలు, కస్టమర్లు ఇచ్చే టిప్ డబ్బులు నేరుగా గిగ్ వర్కర్ ఖాతాలో జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. లేట్ డెలివరీలకు సహేతుక కారణం చూయించినప్పటికీ, పెనాల్టీ వేస్తున్నారని.. దాన్ని రద్దు చేయాలన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా 10 నిమిషాల డెలివరీ నిబంధనను ఎత్తివేయాలని పట్టుబట్టారు. ఈ నిబంధనతో డెడ్‌లైన్ లోపు డెలివరీ చేయాలన్న లక్ష్యంతో గిగ్‌వర్కర్లు ప్రమాదాలబారిన పడుతున్నట్టు గుర్తు చేశారు.
పండుగలు, వేడుకల సమయంలో సమ్మెకు దిగితేనే.. తమ ఆందోళన గురించి ప్రభుత్వం పట్టించుకొంటుందని ఐఎఫ్ఏటీడబ్ల్యూ ప్రతినిధులు తెలిపారు. న్యూఇయర్ సందర్భంగా 31వ తేదీన మరోమారు సమ్మెకు దిగనున్నట్టు పేర్కొన్నారు. కాగా 15 గంటలపాటు నిర్విరామంగా పనిచేసి.. 28 డెలివరీలు చేసిన ఓ గిగ్వర్కర్కు రూ. 763 మాత్రమే దక్కిందని ఆమ్ఆద్మీపార్టీ (ఆప్) నేత రాఘవ్ చద్దా ఎక్స్‌లో వాపోయారు. ‘ఇదీ మన గిగ్ ఎకానమీ’ అసలు సక్సెస్ స్టోరీ అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేశారు.