Delimitation | డీలిమిటేషన్ అంశంపై చెన్నైలో విపక్షాల నేతలు సమావేశమయ్యారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. డీలిమిటేషన్‌పై న్యాయ పోరాటం చేస్తామని స్టాలిన్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కేరళ సీఎం పీ విజయన్ మాట్లాడారు. పార్లమెంట్ నియోజకవర్గాల డీలిమిటేషన్ అంశంపై మెడపై వేలాడుతున్న కత్తిలా ఉందన్నారు. ఎవరితోనూ చర్చించకుండానే డీలిమిటేషన్ అంశంపై బీజేపీ అడుగులు వేసిందని ఆరోపించారు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమని, ప్రజాస్వామ్య ప్రక్రియకు విరుద్ధమని అభివర్ణించారు. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ స్థానాల డీలిమిటేషన్ జరిగితే సీట్లు తగ్గుతాయన్నారు. బీజేపీ అధినేత, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ఓ వీడియో సందేశంలో జేఏసీ సమావేశం చాలా కీలకమైందన్నారు.
జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్.. జనాభాను నియంత్రించే రాష్ట్రాలకు అన్యాయమన్నారు. జనాభా ప్రాతిపదికన మాత్రమే డీలిమిటేషన్ చేయకూడదనేది తమ డిమాండ్ అన్నారు. అన్ని సందేహాలను నివృత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని పార్టీలతో సవివరంగా చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో డీలిమిటేషన్‌పై నేతలు తీర్మానం చేశారు. డీలిమిటేషన్ అంశంపై ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని వాటాదారులతో సవివరమైన చర్చలు జరపాలని తీర్మానం డిమాండ్ చేశారు. 42వ, 84వ, 87వ రాజ్యాంగ సవరణలను పరిరక్షించాలని.. అందులో జనాభా నియంత్రణ చర్యలు అమలు చేయబడినట్లుగా నేతలు పేర్కొన్నారు.
తద్వారా దేశ జనాభాను నియంత్రించవచ్చని.. జనాభా నియంత్రణ చేసిన రాష్ట్రాలను శిక్షించకూడదని నేతలు పేర్కొన్నారు. జేఏసీ తర్వాతి మీటింగ్ హైదరాబాద్‌లో జరుగనున్నది. ఇంకా తేదీ ఖరారు కాలేదు. సమావేశంలో డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడుతూ ప్రతిపాదిత డీలిమిటేషన్లో పారదర్శకత లోపించిందని, ఇందుకు సంబంధించి వివిధ వాటాదారులతో ఎలాంటి చర్చ జరగలేదని అన్నారు. 1971 జనాభా లెక్కల ఆధారంగా పార్లమెంట్ స్థానాలపై విధించిన నిషేధాన్ని మరో 25 ఏళ్ల పాటు పొడిగించాలని డిమాండ్ చేశారు.