కేంద్రం తెచ్చిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతో దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయం జరుగనున్నదా? అంటే అవును అనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు! ఈ బిల్లు ప్రకారం.. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలు.. గరిష్ఠంగా 850కి పెరుగనుండగా 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేపడుతామని కేంద్రం ప్రకటించింది. అంతకుముందు కొన్ని రాజకీయ పార్టీలతో సమావేశమై లోక్‌సభ స్థానాలను దామాషా లెక్కన 50 శాతం పెంచాలని నిర్ణయించింది.
ఈ ప్రకటనలు ఒకదానికొకటి భిన్నంగా ఉన్నా, కేంద్రం ప్రకటించిన ఈ ప్రతిపాదనల్లో దక్షిణాది రాష్ర్టాలకు తీరని ద్రోహమే మిగులుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాలను పునర్విభజిస్తే జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ర్టాలు తీవ్రంగా నష్టపోగా, ఇదే సమయంలో పాటించని ఉత్తరాది హిందీ బెల్ట్ రాష్ర్టాలు గణనీయంగా సీట్ల లబ్ధి పొందుతాయని స్పష్టమవుతున్నది. 50 శాతం పెంపు ఫార్ములా అయినా, 850 సీట్ల కోటా అయినా చివరికి దక్షిణాది రాష్ర్టాలే నష్టపోతాయని తేటతెల్లమవుతున్నది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ‘వన్ నేషన్-వన్ రేషన్’, ‘వన్ నేషన్-వన్ రిజిస్ట్రేషన్’, ‘వన్ నేషన్-వన్ ట్యాక్స్’, ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’.. ఇలా పొద్దున లేచింది మొదలు ‘దేశమంతా ఒక్కటే’ అన్నట్టు ప్రకటనలతో ఊదరగొట్టే కేంద్రంలోని బీజేపీ సర్కారు చేతల్లో మాత్రం విభజన రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నది.
తాము అధికారంలో ఉన్న యూపీ, బీహార్ వంటి ఉత్తరాది హిందీ బెల్ట్ రాష్ర్టాలపై కన్నతల్లి ప్రేమను చూయిస్తున్న కేంద్రం.. దేశప్రగతికి చోదకశక్తిగా మారిన.. విపక్ష రాష్ర్టాలు పాలన సాగిస్తున్న దక్షిణాది రాష్ర్టాలపై మాత్రం సవతి తల్లి ప్రేమను చూయిస్తున్నది. పైకి సమైక్య భారతమే తమ లక్ష్యంగా బిల్డప్ ఇస్తున్న బీజేపీ సర్కార్.. ఒక్కో ప్రాంతాన్ని ఒక్కో తీరుగా చూస్తూ పరోక్షంగా రాష్ర్టాల మధ్య వైరుధ్యాలకు కారణమై రాజకీయ లబ్ధి పొందాలనుకొంటున్నది. డీలిమిటేషన్‌పై కేంద్రం తీసుకొచ్చిన తాజా ప్రతిపాదనలను విశ్లేషిస్తే ఇది సులభంగా అర్థమవుతున్నది.
నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి మంగళవారం కేంద్రం ఓ కీలక బిల్లును ప్రతిపాదించింది. ఈ బిల్లు ప్రకారం.. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలు.. గరిష్ఠంగా 850కు పెరుగనున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్ చేపడుతామని కేంద్రం ప్రకటించింది. దీని కంటే ముందు కొన్ని పార్టీలతో సమావేశమైన కేంద్రం.. లోక్‌సభ స్థానాలను దామాషా లెక్కన 50 శాతం పెంచాలని నిర్ణయించింది.
ఈ ప్రకటనలు ఒకదానికొకటి భిన్నంగా ఉన్నప్పటికీ, కేంద్రం ప్రకటించిన ఈ మూడు ప్రతిపాదనల్లోనూ దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయమే జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాలను పునర్విభజిస్తే జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ర్టాలు తీవ్రంగా నష్టపోగా, ఇదే సమయంలో జనాభా నియంత్రణ పాటించని ఉత్తరాది హిందీ బెల్ట్ రాష్ర్టాలు గణనీయంగా సీట్ల లబ్ధిని పొందుతాయని అంటున్నారు. 50 శాతం పెంపు ఫార్ములా అయినా, 850 సీట్ల కోటా అయినా చివరకు దక్షిణాది రాష్ర్టాలే నష్టపోతాయని విశ్లేషిస్తున్నారు.
543 స్థానాలు ఉన్న ప్రస్తుత లోక్‌సభలో తెలంగాణకు 17 స్థానాల నుంచి ప్రాతినిధ్యం ఉన్నది. ఉత్తరప్రదేశ్‌కు 80 సీట్లు ఉన్నాయి. లోక్‌సభ సీట్లను 850కు పెంచి 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్విభజన చేస్తే.. తెలంగాణ లోక్‌సభ సీట్లు 24కు చేరగా, యూపీ స్థానాలు 140కు ఎగబాకనున్నాయి. ప్రస్తుతం తెలంగాణ, యూపీ మధ్య సీట్ల తేడా 63 ఉండగా.. పునర్విభజన తర్వాత ఈ అంతరం ఏకంగా 116కు పెరుగుతుంది.
అంతేకాదు, ప్రస్తుతం లోక్‌సభలో తెలంగాణ ప్రాతినిధ్యం 3.13 శాతం ఉండగా, యూపీకి 14.73 శాతం ప్రాతినిధ్యం ఉన్నది. పునర్విభజన తర్వాత తెలంగాణ ప్రాతినిధ్యం 2.82 శాతానికి పడిపోతుండగా, యూపీ ప్రాతినిధ్యం మాత్రం 16.47 శాతానికి పెరుగనున్నది. ఇలా కూడా తెలంగాణకు అన్యాయం జరుగనున్నది. ఇది ఒక్క తెలంగాణ పరిస్థితే కాదు.. దక్షిణాదిలోని అన్ని రాష్ర్టాలకు ఈ సమస్య ఎదురుకాబోతున్నది.
ప్రతిపాదన-2: సీట్లను 850కు పెంచడం జనాభా లెక్కలతో సంబంధం లేకుండా లోక్‌సభ సీట్లను 543 నుంచి 850కు పెంచినప్పటికీ, తెలంగాణకు అన్యాయం జరుగనున్నది. ఇదే సమయంలో యూపీకి మేలు జరిగే అవకాశం ఉన్నది. లోక్‌సభ సీట్లను 850కు పెంచి నియోజకవర్గాల పునర్విభజనను చేపడితే, ప్రస్తుత యూపీ సీట్లు 80 నుంచి 125కు పెరుగుతాయి.
ఇదే సమయంలో తెలంగాణ సీట్లు 17 నుంచి 26కు చేరు తాయి. ఈ విధానంలో పార్లమెంట్లో రాష్ర్టాల ప్రాతినిధ్యంలో పెద్దగా మార్పు కనిపించనప్పటికీ, సీట్ల అంతరం మాత్రం పెరిగే అవకాశమున్నది. అంటే ప్రస్తుతం తెలంగాణ, యూపీ మధ్య సీట్ల తేడా 63 ఉండగా.. పునర్విభజన తర్వాత ఈ అంతరం 99కు పెరుగుతుంది. ఇది కూడా దక్షిణాది రాష్ర్టాలకు నష్టమే.
జనగణనతో సంబంధం లేకుండా లోక్‌సభ స్థానాలను దామాషా లెక్కన 50 శాతం మేర పెంచినట్లయితే, ప్రస్తుతం 543గా ఉన్న సీట్లు 816కు చేరుతాయి. ఈ లెక్కన ప్రస్తుత తెలంగాణ సీట్లు 17 నుంచి 26కు పెరగ్గా, యూపీ సీట్లు 80 నుంచి 120కు చేరుతాయి. ఈ విధానాన్ని తీసుకొస్తే.. పార్లమెంట్లో రాష్ర్టాల ప్రాతినిధ్యంలో ఏ మార్పు రానప్పటికీ, సీట్ల అంతరం మాత్రం పెరుగనున్నది. అంటే ప్రస్తుతం తెలంగాణ, యూపీ మధ్య సీట్ల తేడా 63 ఉండగా.. పునర్విభజన తర్వాత ఈ అంతరం 94కు పెరుగుతుంది. ఇది కూడా దక్షిణాది రాష్ర్టాలకు ఒక విధంగా నష్టంగానే చెప్పొచ్చు. వెరసి ఈ మూడు విధానాల్లో ఏ ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చినప్పటికీ, అంతిమంగా నష్టపోయేది తెలంగాణ సహా దక్షిణాది రాష్ర్టాలేనని తెలుస్తున్నది.
1971 జనాభా లెక్కల తర్వాత కేంద్రం జనాభా నియంత్రణ చేపట్టింది. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటించగా, ఉత్తరాదిలో జనాభా విస్ఫోటం సంభవించింది. దీంతో ఉత్తరాదిలోనూ జనాభా నియంత్రణకు ప్రయత్నించారు. ఇందులో భాగంగానే, డీలిమిటేషన్ చట్టం-2002 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజనను 2026 దాకా నిలిపేశారు. కానీ ఉత్తరాదిన జనాభా నియంత్రణ లక్ష్యం నెరవేరలేదు. ఇదే సమయంలో రాజకీయ ప్రయోజనాలను ఆశించిన కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం.. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాలను సవరించాలని యోచిస్తున్నది. ఈ మేరకు డ్రాఫ్ట్ బిల్లులో పేర్కొన్నది. ఇదే జరిగితే, జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంట్లో తమ ప్రాతినిధ్యాన్ని తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నది.
ఇక, దేశ జీడీపీలో 5 దక్షిణాది రాష్ర్టాల వాటా 33%. మిగతా 24 రాష్ర్టాలది 67 శాతం. అయితే, దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ తర్వాత 200 లోక్‌సభ సీట్లను (23 శాతం), మిగతా ఉత్తరాది రాష్ర్టాలకు 650 స్థానాలను (77 శాతం) కట్టబెట్టాలనుకొంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే భాష, సంస్కృతి, నిధుల పంపకం, రాజకీయ ప్రాధాన్యాల విషయాల్లో ఉత్తరాదితో పోలిస్తే వివక్షకు గురవుతున్న దక్షిణాది రాష్ట్రాలకు ఢిల్లీ గద్దెనెక్కాల్సిందెవరో నిర్ణయించే అంశంలోనూ తగిన ప్రాధాన్యం దక్కని పరిస్థితి నెలకొన్నది. దీంతో కేంద్రం ఏకపక్ష నిర్ణయాలపై దక్షిణాది హక్కుల కార్యకర్తలు, రాజకీయ నేతలు మండిపడుతున్నారు.



