Civils students death : ఢిల్లీలోని సివిల్స్ కోచింగ్ సెంటర్ సెల్లార్లో నీళ్లు నిండి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనకు బాధ్యులైన రవూస్ కోచింగ్ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తా, కోఆర్డినేటర్ దేశ్పాల్ సింగ్‌లను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, సెల్లార్లో నీళ్లు నిండి విద్యార్థులు మృతిచెందిన ఘటన దేశమంతటా చర్చనీయాంశమైంది.
కోచింగ్ సెంటర్ యాజమాన్యం, ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందంటూ ఆ కోచింగ్ సెంటర్ ముందు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ ఢిల్లీలోని ఓల్డ్ రాజిందర్ నగర్‌లోగల రవూస్ సివిల్స్ సర్వీస్ కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి శనివారం సాయంత్రం భారీగా నీరు చేరింది.
దాంతో సెల్లార్‌లోని లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులు నీట మునిగారు. ఘటనపై సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది హుటాహుటిన వెళ్లి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. 30 మంది విద్యార్థులను రక్షించారు. కానీ ముగ్గురు విద్యార్థులు మరణించారు. వారిలో ఇద్దరు యువతులు, ఓ యువకుడు ఉన్నారని అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం 7.15 గంటలకు సమాచారం వచ్చిందని, వెంటనే ఐదు ఫైర్ ఇంజిన్లతో ఘటనాస్థలానికి వెళ్లామని ఢిల్లీ అగ్నిమాపక అధికారి అతుల్ గార్గ్ తెలిపారు.
అప్పటికే సెల్లార్ మొత్తం నీటితో నిండి ఉందని, ఇద్దరు యువతులు, ఒక యువకుడి మృతదేహాలను వెలికి తీశామని వెల్లడించారు. కాగా ఈ దుర్ఘటనపై క్రిమినల్ కేసు నమోదుచేశామని, ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశామని సీనియర్ పోలీస్ అధికారి హర్షవర్ధన్ చెప్పారు. ఫోరెన్సిక్ ఆధారాలు సేకరిస్తున్నామని తెలిపారు. మృతులను తానియా సోని (25), శ్రేయ యాదవ్ (25), నవీన్ డాల్విన్ (28) గా గుర్తించామని చెప్పారు.