న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో ‘నీటి సంక్షోభం’ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఆదివారం నగరంలో బీజేపీ చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతను రేపాయి. ఢిల్లీ జల్ బోర్డ్(డీజేబీ) కార్యాలయంలో కొంతమంది ఆందోళనకారులు కార్యాలయం అద్దాల్ని, ఫర్నిచర్‌ను, మట్టి కుండల్ని పగలగొట్టి విధ్వంసం సృష్టించారు. కార్యాలయంపై దాడికి దిగింది బీజేపీ నాయకులు, కార్యకర్తలేనంటూ ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు.
తాగునీటి పైప్లైన్ల వద్ద పోలీస్ పహారా ఏర్పాటుచేయాలని ఢిల్లీ జల మంత్రి ఆతిశీ రాష్ట్ర పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. నీటి సరఫరా వ్యవస్థను కొంతమంది దుండగులు ధ్వంసం చేసేందుకు యత్నిస్తున్నారని ఢిల్లీ ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాన పైప్లైన్ల వద్ద 15 రోజులపాటు పోలీస్ భద్రత ఏర్పాటుచేయాలని పోలీస్ కమిషనర్‌కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేసింది. ఢిల్లీ ప్రజలకు వ్యతిరేకంగా బీజేపీ కుట్రకు పాల్పడుతుందని అతిశీ ఆరోపించారు.