న్యూఢిల్లీ: ఇండిగో విమానంలో తప్పుగా పొగ హెచ్చరిక వచ్చింది. దీంతో పైలట్లు ‘మే డే’ సందేశాన్ని పంపారు. అప్రమత్తమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) ఫైర్ బ్రిగేడ్‌ను అలెర్ట్ చేసింది. ఆ విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు త్వరగా క్లియరెన్స్ ఇచ్చింది. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన 6ఈ-2513 కార్గో విమానం ఆదివారం సాయంత్రం ఢిల్లీ నుంచి కోల్‌కతాకు బయలుదేరింది.
అయితే కార్గో ఉన్న ప్రాంతంలో పొగ వచ్చినట్లు అలారమ్ హెచ్చరించింది. అప్రమత్తమైన పైలట్లు ప్రాణాంతకమైన అత్యవసర పరిస్థితిని సూచించే ‘మే డే’ కాల్ పంపారు. దీంతో కోల్‌కతా విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) వెంటనే స్పందించింది. విమానాశ్రయంలోని అగ్నిమాపక దళాన్ని అలెర్ట్ చేసింది. ఆ విమానం ల్యాండింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో అది సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.
కాగా, ఈ సందర్భంగా తమ పైలట్లు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్స్ (ఎస్‌ఓపీఎస్)ను పాటించారని ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ తెలిపింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత సంబంధిత తనిఖీలు చేపట్టినట్లు చెప్పింది. అయితే విమానంలో ఎలాంటి పొగ లేకుండానే హెచ్చరిక వచ్చినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆ వ్యవస్థను సరిచేస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు డీజీసీఏ అధికారులు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.