దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టింది. శనివారం నుంచి ప్రైమరీ పాఠశాలల మూసివేత, సోమవారం నుంచి ప్రభుత్వ ఉద్యోగుల్లో 50 శాతం మందికి వర్క్ ఫ్రం హోం వంటి నిర్ణయాలు తీసుకొన్నది. వర్క్ ఫ్రం హోం విధానాన్ని ప్రైవేటు సంస్థలు కూడా పాటించాలని సూచించింది. వీటితో పాటు ఢిల్లీలో మార్కెట్లు, ఆఫీసుల పనివేళల సమయం తగ్గింపుపై కూడా యోచిస్తున్నట్టు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ పేర్కొన్నారు. ఢిల్లీలో శుక్రవారం వాయు నాణ్యత సూచీ 500కి చేరింది. ఏక్యూఐ 400 దాటితే తీవ్రస్థాయిగా పరిగణిస్తారు.