న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కలకలం రేపుతున్నది. బుధవారం అనూహ్యంగా కరోనా కొత్త కేసులు వెయ్యి దాటాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,009 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పాజిటివిటీ రేటు 5.7 శాతానికి పెరిగింది. మంగళవారం కరోనా కేసులు 632 కాగా బుధవారం 377 కేసులు అదనంగా తోడయ్యాయి. అలాగే యాక్టివ్ కేసుల సంఖ్య మంగళవారం 1,947 ఉండగా బుధవారానికి ఇది 2,641కి చేరింది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,70,692కు పెరిగింది. బుధవారం ఢిల్లీలో కరోనా బారినపడి ఒకరు మరణించారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 26,161కు పెరిగింది. గత 24 గంటల్లో 314 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 18,41,890కి చేరింది.
ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వల్ల ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నది. అయితే ఎలాంటి భయాందోళన అవసరం లేదని ఆప్ ప్రభుత్వం తెలిపింది. తగినన్ని బెడ్లను ఆసుపత్రుల్లో సిద్ధం చేసినట్లు పేర్కొంది. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (డీడీఎంఏ) బుధవారం సమావేశమైంది. ఈ నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఉల్లంఘించిన వారికి రూ.500 జరిమానా విధిస్తామని హెచ్చరించింది.