Delhi Blast | న్యూఢిల్లీ, నవంబర్ 11: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న భారీ బాంబుపేలుడుపై ఢిల్లీ పోలీసులు, భద్రతా దళాలు మంగవారం దర్యాప్తు ప్రారంభించాయి. వీరు ముఖ్యంగా మూడు కోణాల్లో తమ దర్యాప్తును కొనసాగించనున్నారు. అనుమానితుల కదలికలపై దృష్టి, ఫరీదాబాద్‌లోని యూనివర్సిటీలో ఉన్న అనుమానిత నెట్ వర్క్,ఎలాంటి పేలుడు పదార్ధాన్ని వినియోగించారు అన్న అంశాలపై దర్యాప్తు సాగుతుందని న్యూఢిల్లీ పోలీస్ వర్గాలు తెలిపాయి.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న డాక్టర్ ఉమర్ తన ఐ-20 కారు ద్వారా 3.19 నుంచి 6.22 గంటల సమయంలో ఎలాంటి కదలికలు చోటుచేసుకున్నాయి, అతని వాహనం పార్కింగ్ చేసిన రెడ్ ఫోర్ట్ పార్కింగ్ ప్రదేశంలో వాహనంలో ఎలా పేలుడు సంభవించిందన్న విషయంపై దృష్టి సారించారు. అతడు వాహనం వద్దే ఉన్నాడా, ఎవరినైనా కలుసుకున్నాడా? లేక ఆ ప్రాంతాల్లో పరిశీలన జరిపాడా? పేలుడుకు ముందు అక్కడ జనసందోహం ఏర్పడటం కోసం వేచి చూశాడా అన్నది కూడా పరిశీలిస్తున్నారు.
అమ్మోనియం నైట్రేట్తోనే ఢిల్లీ పేలుడు ; ఆర్డీఎక్స్ కన్నా శక్తివంతమైందా?
న్యూఢిల్లీ, నవంబర్ 11: ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్‌సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన కారు పేలుడులో ఉపయోగించిన పేలుడు పదార్థాన్ని అమ్మోనియం నైట్రేట్, ఇంధన చమురుగా దర్యాప్తు సంస్థ గుర్తించింది. ఐ20 కారులో పేలుడు మిశ్రమాన్ని నింపి పేల్చివేయడం ద్వారా ఆత్మాహుతి దాడి జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కాగా, ఉగ్రవాదులు తమ దాడులలో ఎక్కువగా ఆర్డీఎక్స్ని ఉపయోగిస్తుంటారు. అయితే సోమవారం హర్యానాలోని ఫరీదాబాద్‌లో పోలీసులు జరిపిన దాడులలో 350 కిలోల అమ్మోనియం నైట్రేట్ లభించడం, జైషే మొహమ్మద్ గ్రూపుతో సంబంధం ఉన్న అల్ ఫలాహ్ దవాఖానలో పనిచేస్తున డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ అదిల్ అహ్మద్ రాథెర్, డాక్టర్ షాహిన్ షహీద్ అరెస్టు కావడంతో నాలుగో సభ్యుడైన డాక్టర్ ఒమర్ మొహమ్మద్ తాను కూడా అరెస్టు అవుతానన్న భయంతో 2,000 కిలోలకు పైగా పేలుడు పదార్థాన్ని సేకరించి రెడ్ ఫోర్ట్ కారు బాంబు పేలుడును సృష్టించినట్లు అనుమానిస్తున్నారు. అమ్మోనియం నైట్రేట్ తెల్లని పొడి రూపంలో ఉండే రసాయనిక పదార్థం.