న్యూఢిల్లీ: సహజీవనం చేస్తున్న శ్రద్ధా వాల్కర్ను చంపిన కిల్లర్ అఫ్తాబ్ అమీన్ పూనావాలాకు ఢిల్లీ పోలీసులు నార్కో పరీక్షలు చేయనున్నారు. అఫ్తాబ్ చెప్పేదాంట్లో నిజం ఎంత ఉందో తెలుసుకునేందుకు అతనికి ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. విచారణ సమయంలో హంతకుడు తప్పుడు సమాచారం ఇస్తున్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. లివిన్ పార్ట్నర్ శ్రద్ధాను అత్యంత కిరాతంగా చంపి.. ఆమె శరీరాన్ని 35 భాగాలుగా కోసి.. వాటిని ఢిల్లీలో విసిరివేసినట్లు తెలిసిందే.
ఈ కేసులో విచారణను లోతుగా చేసేందుకు పోలీసులు నార్కో పరీక్షలు చేపట్టనున్నారు. నిందితుడి మానసిక స్థితి ఎలా ఉందో ఆ పరీక్ష ద్వారా తేల్చనున్నారు. ఢిల్లీలోని సాకేత్ కోర్టు.. నార్కో పరీక్ష నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. శ్రద్ధా ఫోన్ను ఏం చేశాడు, ఆమెను ముక్కలుగా నరికేందుకు వాడిన కత్తి ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఒకవేళ అఫ్తాబ్ మానసికంగా సరిగా లేకుంటే అప్పుడు ఏం చేయాలో కూడా పోలీసులు ఓ నిర్ణయాన్ని తీసుకోనున్నారు. గతంలో కూడా ఢిల్లీ పోలీసులు సైకో అనాలసిస్ పరీక్షలు నిర్వహించారు. గత ఏడాది ఇజ్రాయిల్ ఎంబసీ బ్లాస్ట్ కేసులో అరెస్టు అయిన నలుగురిపై సైకో అనాలసిస్ పరీక్షలు చేశారు. దాని ద్వారా వాళ్లు పాక్షికంగా మాత్రమే నిజం చెబుతున్నట్లు గుర్తించారు.