న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థ ఆల్ ఖయిదా టెర్రర్ మాడ్యూల్(Al Qaeda Terror Module) గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటనలో జార్ఖండ్, రాజస్థాన్, యూపీకి చెందిన 14 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఆయా రాష్ట్రాలకు చెందిన పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. జార్ఖండ్‌లోని రాంచీకి చెందిన డాక్టర్ ఇస్తియాక్ ఈ మాడ్యూల్ నేతృత్వం వహించాడు. ఖిలాఫత్ ప్రకటించిన ఆ ఉగ్రవాదులు.. దేశవ్యాప్తంగా తీవ్రమైన ఉగ్ర చర్యలకు పాల్పడేందుకు సిద్దమయ్యారు. టెర్రర్ మాడ్యూల్‌లోని సభ్యులు శిక్షణ పొందారని, వేర్వేరు ప్రాంతాల్లో వెపన్స్ ఎలా హ్యాండిల్ చేయాలన్న అంశంలోనూ శిక్షణ పొందినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
రాజస్థాన్‌లోని భీవండి నుంచి ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. వెపన్స్ హ్యాండ్లింగ్‌లో వాళ్లు శిక్షణ పొందుతున్నట్లు తెలిసింది. జార్ఖండ్, యూపీ నుంచి 8 మందిని అరెస్టు చేశారు. ప్రస్తుతం అనుమానితుల్ని విచారిస్తున్నారు. త్వరలో అదనపు అరెస్టులు ఉంటాయని పోలీసులు చెప్పారు. సోదాల ద్వారా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, డాక్యుమెంట్లను రికవర్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 17 ప్రదేశాల్లో రెయిడ్స్ జరిగాయి, మరికొన్ని చోట్ల జరుగుతున్నట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు.