న్యూఢిల్లీ: నకిలీ ప్రభుత్వ గుర్తింపు పత్రాలు, కార్డులను తయారు చేసి వెబ్సైట్ ద్వారా అమ్ముతున్నారు. సోషల్ మీడియాపై నిఘా ఉంచిన అధికారులు దీనిని పసిగట్టారు. దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. (Selling Fake Government IDs) bkprint.in అనే వెబ్సైట్ ద్వారా నకిలీ ప్రభుత్వ గుర్తింపు పత్రాలు తయారు చేసి ఆన్లైన్లో విక్రయిస్తున్నారు. నకిలీ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీ కార్డులు, పాన్ కార్డు, నివాస ధృవీకరణ పత్రాలు, కుల ధృవీకరణ పత్రాలు, జనన, మరణ ధృవీకరణ పత్రాలు, ఇతర ప్రభుత్వ పత్రాల వంటి రికార్డులను ఈ వెబ్సైట్ ద్వారా అందజేస్తున్నారు.
కాగా, సోషల్ మీడియాను పర్యవేక్షించే అధికారుల ద్వారా ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు నిఘా సమాచారం అందింది. దీంతో ఒక నకిలీ యూజర్ ఖాతా సృష్టించారు. యూపీఐ ఐడీ ద్వారా ఆ వెబ్సైట్ డిజిటల్ వాలెట్‌కు రూ.100 రీఛార్జ్ చేశారు. కల్పిత వివరాలు నమోదు చేసి, ఒక ఫోటో అప్లోడ్ చేసి నకిలీ ఆధార్, ఓటర్ ఐడీ కార్డులు పొందారు.
మరోవైపు ఈ నకిలీ ఐడీ కార్డులు, పత్రాలు అసలైన ప్రభుత్వ రికార్డులను పోలి ఉండటం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. దీనిపై దర్యాప్తు చేపట్టారు. ఆ వెబ్సైట్ యూపీఐ ఖాతాకు అనుసంధానమైన మొబైల్ నంబర్ ద్వారా డామన్-డయూకు చెందిన బిదేశీని అరెస్ట్ చేశారు. అతడ్ని ప్రశ్నించిన తర్వాత ఆ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్న పాట్నాకు చెందిన సంతోష్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, డిజిటల్ చెల్లింపు రికార్డులు, వెబ్సైట్ సోర్స్ కోడ్, కస్టమర్ డేటాబేస్లు, హోస్టింగ్ వివరాలు, bkprint.in, bkprint.xyz కు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ అంతరాష్ట్ర నెట్‌వర్క్‌లోని ఇతర సభ్యులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. నిందితులు ఎంత డబ్బు సంపాదించారు? ఎంతమంది కస్టమర్లు ఉన్నారు? నకిలీ పత్రాలు సేకరించిన లేదా దుర్వినియోగం చేసిన వ్యక్తులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఎన్నికల జాబితా సవరణ (సర్) పక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఈ వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేసిన నకిలీ ప్రభుత్వ పత్రాలు దీనికి వినియోగించారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.