Air Pollution | ఢిల్లీ నగరాన్ని గురువారం దీపావళి రోజున కాలుష్యం భారీగా పెరిగింది. ఆనంద్ విహార్ ప్రాంతాన్ని ఉదయం వరకు పొగమంచు కమ్మేసింది. సీపీసీబీ డేటా ప్రకారం.. ఆనంద్ విహార్లో గాలి నాణ్యత సూచీ 418గా నమోదైంది. ఢిల్లీలోని అక్షరధామ్ ఆలమ సమయంలోనూ గాలి నాణ్యత పడిపోయింది. ఢిల్లీలో బుధవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 307గా నమోదైంది. 2023 సంవత్సరంలో 220 ఉండగా.. 2022లో 259గా నమోదైంది. ఇక గురువారం దీపావళి పండుగ కావడంతో బాణాసంచాలు కాలిస్తే గాలి నాణ్యత మరింత పడిపోయే ప్రమాదం ఉన్నది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) అంచనా ప్రకారం.. గురువారం గాలి చాలా పేలవమైన కేటగిరీలో ఉంటుంది. అలాగే, బాణసంచా కాల్చడం, పొరుగు రాష్ట్రాల్లో వ్యర్థాల దహనంతో వచ్చే పొగ కారణంగా గాలి విషపూరితమవుతుందని అంచనా వేసింది. దాంతో గాలి నాణ్యత తీవ్రమైన కేటగిరికి చేరే ప్రమాదం ఉంటుందని.. దాంతో ప్రజలంతా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులుపడే అవకాశం ఉందని చెప్పింది. కాలుష్యం కారణంగా అనేక ఇబ్బందులుపడుతున్నామని ఢిల్లీకి పౌరుడు ఒకరు తెలిపారు. ముఖ్యంగా కండ్లు మండుతున్నాయని వాపోయాడు. రాబోయే ఐదురోజులు గాలి నాణ్యత పడిపోయే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.