న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పెరుగుతుండగా.. ప్రభుత్వం నివారణకు చర్యలు చేపడుతున్నది. పొల్యూషన్ కారణంగా ఇప్పటికే కొన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో పాటు పలు వాహనాలపై నిషేధం విధించిన విషయం విధితమే. తాజాగా ఈ నెల 9 నుంచి ప్రాథమిక పాఠశాలలను తెరువడంతో పాటు పలు నిర్మాణ పనులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్‌రాయ్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు 50శాతం ఇంటి నుంచి పని చేసేలా ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తున్నామని, రైల్వే, రహదారులు, హైవేలు, ఫ్లై ఓవర్ల నిర్మాణ పనులపై విధించిన నిషేధాన్ని వేస్తున్నామన్న ఆయన.. ప్రైవేటు కట్టడాలకు సంబంధించిన నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
అలాగే బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ వాహనాలపై నిషేధం కొనసాగనుండగా.. టక్కుల ప్రవేశంపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు మంత్రి గోపాల్‌రాయ్ పేర్కొన్నారు. గత రెండు రోజుల్లో ఢిల్లీలో కాలుష్యం వేగంగా మెరుగుపడిందని చెప్పారు. ఇటీవల గత కొద్ది రోజలుగా దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా దీపావళి పండుగ తర్వాత తారాస్థాయికి చేరింది. దీంతో జనం శ్వాస తీసుకునేందుకు సైతం ఇబ్బందులకు గురయ్యారు. గత కొంతకాలంగా ఐదింట నాలుగు కుటుంబాలు కాలుష్య సంబంధిత సమస్యల బారినపడుతున్నారని సర్వే సంస్థ లోకల్ సర్కిల్స్ తెలిపింది.