Metro Rail | న్యూఢిల్లీ : రాఖీ పండుగ వేళ ఢిల్లీ మెట్రో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒక్క రోజులోనే లక్షల మంది ప్రయాణించారు. ఆగస్టు 8వ తేదీన 81,87,674 మంది ప్రయాణించినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ శనివారం ప్రకటించింది. ఆగస్టు 8న 92 ట్రిప్పులు అదనంగా నడిపారు. రాఖీ పండుగ రోజు శనివారం నాడు 455 అదనపు ట్రిప్పులు నడిపినట్లు పేర్కొన్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని మెట్రో రైళ్లను నడిపినట్లు తెలిపారు.
ఇక ఢిల్లీ మెట్రోను ప్రయాణికులు అభినందించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనంగా సర్వీసులను నడిపినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రద్దీగా ఉన్న స్టేషన్లు, మెట్రో రైళ్ల ఫొటోలను, వీడియోలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు ప్రయాణికులు. నిలబడేందుకు ప్లేస్ లేకుండా కిక్కిరిసిగా మారాయి మెట్రో రైళ్లు, స్టేషన్లు. దీంతో ప్రయాణికులకు ఊపిరాడలేదు. ఆ జనాన్ని చూసి మెట్రో సిబ్బంది కూడా షాకయ్యారు.
ఢిల్లీ మెట్రోకు పండుగ వేళ భారీగా డిమాండ్ ఉంటుంది. చాలా మంది మెట్రో ప్రయాణాన్ని ఎంచుకుంటున్నారు. ఢిల్లీ మెట్రో మొత్తం 400 కిలోమీటర్ల నెట్వర్క్ను కలిగి ఉంది. ఢిల్లీతో పాటు సమీప పట్టణాలు నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్, బహదూర్గర్హ్ వరకు మెట్రో సేవలు కొనసాగుతున్నాయి.